ఇక్కడ పెళ్లికి ఉల్లి కానుక.. అక్కడ వేలు కొరికాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇక్కడ పెళ్లికి ఉల్లి కానుక.. అక్కడ వేలు కొరికాడు..

December 7, 2019

Onions bowl gift to marriage in Karnataka .

చెప్పులోని రాయి, చెవిలోన జోరిగ కష్టాలతో పోలిస్తే ఉల్లి బాధలే ఎక్కవ అంటున్నారు జనం. రూ. 200 మార్కుకు చేరువైన గడ్డలను కొనలేక జనం నిర్రుచిగా గడిపేస్తున్నారు. మరోపక్క.. ఉల్లిపై సరదాలు, నేరాలు కూడా సాగుతున్నాయి. ముఖ్యంగా కొత్త పెళ్లికొడుకులను బాగా ఆటపట్టిస్తున్నారు. కర్ణాటకలో ఇటీవల పెళ్లయిన జంటకు బుట్ట ఉల్లిగడ్డలను కానుకగా సమర్పించుకున్నాడు ఉల్లి కష్టనష్టాలు తెలిసిన బంధువు. 

గిఫ్ట్ ప్యాకెట్ ఇవ్వగానే కొత్తజంట ఆసక్తితో తెరిచింది. చివరికి బుట్టలో గడ్డలు కనిపించగానే తెగ సిగ్గుపడిపోయింది. కల్యాణమంటంలో ఈ ఉల్లి లొల్లి ఏందని జనం కూడా నవ్వుకున్నారు. మరోపక్క.. పుణ్యానికిపోతే పాపం ఎదురైందన్నట్టు ఓ పెద్దమనిషి మనిషి కాటుకు బలయ్యాడు. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేత నందన్ మెహ్రా.. జనం కష్టాలను చూసి తట్టుకోలేక సొంత డబ్బుతో ఉల్లిని కొని కేజీ రూ. 30 చొప్పున జనానికి అమ్మేశాడు. ఇది గిట్టని మనీశ్ బిస్త్ అనే దానయ్య.. మెహ్రాతో గొడవకు దిగాడు. తక్కువకు అమ్మడం సరికాదన్నాడు. మాటామాటా పెరిగింది. గొడవలో మనీశ్ కోపం తట్టుకోలేక.. మెహ్రా వేలిని నోట్లోకి తీసుకుని కొరికేశాడు. మనీశ్ బీజేపీ కార్యకర్త అని వార్తలు వస్తుండగా అబ్బే మా వాడు కాదని కమలనాథులు తప్పించుకుంటున్నారు.