‘ఉల్లి తినరంట.. మీ తిండే తినాలని ఆదేశమా?’ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఉల్లి తినరంట.. మీ తిండే తినాలని ఆదేశమా?’

December 5, 2019

Onions

ఉల్లి ధర కేవలం మార్కెట్లనే కాకుండా కులాలను, కుల వివక్షను కూడా రంగంలోకి లాక్కొస్తోంది. మన దేశంలో తిండికీ కులం ఉంటుందని, నేతల ‘ఉల్లి’ వ్యాఖ్యలతో ఇది మరోసారి రుజువైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘మా ఇంట్లో ఉల్లిని తక్కువగా తింటాం..’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్, ‘నేను ఉల్లి ముట్టను. ధర పెరిగిన సంగతి నాకెలా తెలుస్తుందబ్బా’ అని మరో మంత్రి అశ్వనీ చౌబీలే చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. చిన్నాచితకా నేతలు కూడా ఉల్లి, వెల్లుల్లి ధరలపై గగ్గోలు పెట్టకుండా క్యాబేజీ వంటివి వాడుకోవాలని ఎద్దేవా చేస్తున్నారు. వారు బ్రాహ్మణులు కనుక ఉల్లి ధరల విషయంలో నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. 

ఉల్లి, టొమాటో తదితర నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని, వాటిని తగ్గించుకుండా వ్యక్తిగత విషయాలతో తప్పుదోవ పట్టించొద్దని కొందరు నెటిజన్లు కోరుతున్నారు. మంత్రులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ప్రజల కష్టాలను ఇలా ‘మేం తినమబ్బా’ అంటూ చులకన చేయడం తగదని సూచిస్తున్నారు. మంత్రుల వ్యాఖ్యలు అగ్రవర్ణాల ఆహారం గొప్పదని పరోక్షంగా ప్రకటించడమేనని అంటున్నారు.