ఉల్లి కిలో రూ.220.. పొరుగు దేశంలోనూ కన్నీరే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఉల్లి కిలో రూ.220.. పొరుగు దేశంలోనూ కన్నీరే..

November 18, 2019

Onions .

ఉల్లిపాయలు మన దేశంలోనే కాకుండా పొరుగు దేశాల్లోనూ చుక్కలు చూపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో కిలో ఉల్లిపాయలు రూ.220 పలుకుతోంది.  ప్రజలు కూరల్లో ఉల్లిని తరగాలంటే బెంగ పడుతున్నారు. భారత్ నుంచి దిగుమతి ఆగిపోవడంతో ధర అమాంతం పెరిగిపోయింది. దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. విమానాల ద్వారా టర్కీ, ఈజిప్ట్, చైనా నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటూ ఉల్లి ధరలు తగ్గించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

పలు ప్రాంతాల్లో ఉల్లి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి కిలో ఉల్లి రూ.38కి అందించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్‌ హసినా కఠిన నిర్ణయం తీసుకున్నారు. తన ఇంట్లో కూరల్లో ఉల్లిని వాడవద్దని నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నివాసంలో ఉల్లిపాయలతో తయారు చేసే వంటలేవీ కనిపించడంలేదని హసీనా కార్యదర్శి జాహిద్ తుషార్ తెలిపారు. వర్షాల కారణంగా భారత్‌లో చాలా చోట్ల ఉల్లిపంట దెబ్బతింది. దీంతో భారత్‌లోనూ ఉల్లి కొరత ఏర్పడింది. దిగుబడి తగ్గిపోవడంతో డిమాండ్‌ను అందుకోవడంలేదు. ఫలితంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఈ ప్రభావం పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌పై తీవ్రంగా పడింది.