ఇలాంటి సింహాలను మీరెప్పుడూ చూసుండరు - MicTv.in - Telugu News
mictv telugu

ఇలాంటి సింహాలను మీరెప్పుడూ చూసుండరు

January 20, 2020

Lions.

సింహం అంటేనే రాజసానికి నిలువుటద్దం. దాన్ని చూస్తే అడవిలోని జంతువులన్నింటికీ భయమే. మనం చూసినా జడుసుకుంటాం. అయితే, ఈ సింహాలను చూస్తే భయం సంగతి అటుంచితే జాలి కలిగి అయ్యోపాపం అంటారు. ఎందుకంటారా.. ఈ సింహాలు కరువు దెబ్బకు బక్కచిక్కిపోయాయి. ఓ రేంజ్‌లో ఉండే ఆఫ్రికా జాతి సింహాలేనా ఇవి అని అనిపించకమానదు? ఆఫ్రికా దేశమైన సూడాన్‌లోని అల్ ఖురేషీ పార్క్‌లో ఉన్న ఈ సింహాలు ఎముకల గూళ్లలా తయారయ్యాయి. ఆ సింహాలు అలా బక్కచిక్కి పోవడానికి కారణం.. సింహాలు ఉన్న జూలో కరవు తాండవిస్తోంది. వాటికి పెట్టడానికి ఆహారం లేదు. దీంతో అవి అలా తయారయ్యాయి.  

ఆ పార్క్‌కు వచ్చిన సందర్శకులు వాటి రూపాలను చూసి అయ్యో పాపం అంటున్నారు. అవి అనారోగ్యానికి గురైతే సరైన చికిత్స కూడా అందుబాటులో లేదట. సందర్శకులు వీటి పరిస్థితి చూసి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి. ఈ సింహాలను వెంటనే మరో చోటికి తరలించాలని జంతు ప్రేమికులు, జర్నలిస్టులు కోరుతున్నారు. ఉస్మాన్ సలీహ్‌ అనే జంతు ప్రేమికుడు ఏకంగా ఫేస్‌బుక్ ద్వారా క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. ఈ సింహాల పరిస్థితిని చూసి తనకు ఎంతో జాలి వేసిందని ఉస్మాన్ తెలిపాడు. జంతు ప్రేమికులు ఈ సింహాలను ఆదుకోవాలని సహాయం అర్థించాడు.  ఇదిలావుండగా చాలా సింహాలు సగానికి పైగా బరువు తగ్గాయని పార్క్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణం గత కొన్ని వారాలుగా సింహాలు తినేందుకు ఆహారం లేదని చెప్పుకొచ్చారు. తమ సొంత జేబుల్లో నుంచి వాటి ఆహారం కోసం ఖర్చు చేస్తున్నట్లు పార్కు సిబ్బంది వెల్లడించింది.