బాల‘నేరస్తుడి’కి పోలీసమ్మ గిఫ్ట్.. కదిలించే కథ  - MicTv.in - Telugu News
mictv telugu

బాల‘నేరస్తుడి’కి పోలీసమ్మ గిఫ్ట్.. కదిలించే కథ 

September 21, 2020

Online class boy stolen mobile phone Chennai

పుట్టుకతో ఎవరూ నేరస్తులు కాదు. చుట్టూ ఉన్న పరిస్థితిలే నేరాలకు పురిగొల్పుతాయి. బంగళాల్లో పుట్టి, ఐశ్వర్యం నడుమ పెరిగిన పిల్లలకు దొంగతనం చేయాల్సిన అవసరం ఉండదు. పూరి గుడిసెలో పుట్టి ఆకలి, దరిద్రంతో అల్లాడే పిల్లలు పిడికెడు తిండి కోసం చోరీ చేసే అవకాశాలు ఉండొచ్చు. లాక్‌డౌన్ అలాంటి పేదల పరిస్థితిని మరింత దిగజార్చడం తెలిసిందే. పిల్లలు సరైన తిండికే కాకుండా చదువులకు కూడా దూరమయ్యారు. కొందరు ఆన్‌లైన్ క్లాసుల్లో చదువుకుంటున్నారు. కానీ ఆ సౌకర్యంలో  మనదేశంలో అందరికీ లేదని కొన్ని ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. 

ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు చెన్నైకి చెందిన ఓ 13 ఏళ్ల బాలుడు చోరీ చేశాడు. ఇద్దరు దొంగలు అతణ్ని పావుగా మార్చుకుని ఫోన్లు చోరీ చేయించారు. ఆ పిల్లాడి తండ్రి బిస్కట్ ఫ్యాక్టరీ కార్మికుడు. తల్లి పనిమనిషి. డబ్బుల్లేకపోవడంతో అతనికి ఫోన్ కొనివ్వలేకపోయారు. తాము చెప్పినట్లు చేస్తే ఫోన్ వస్తుందని దొంగలు చెప్పడంతో అతడు వారి మాట విన్నాడు. ముగ్గురూ కలసి తిరువత్తూరులో ఓ ట్రక్ డ్రైవర్ ఫోన్ కొట్టేశారు. అయితే అక్కడి జనం వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో బాలుడి విషయం తెలిసింది. క్రైమ్ ఇన్ స్పెక్టర్ భువనేశ్వరి అతని పేదరికాన్ని తెలుసుకుని చలించిపోయింది. ఆన్ లైన్ క్లాసుల కోసం ఫోన్ కొనుక్కోవాలని అతనికి డబ్బు ఇచ్చింది. ‘నా కూతురికి ఆన్ లైన్ క్లాసుల కోసం ఫోన్ కొందామనుకున్నా. కానీ ఈ పిల్లవాడి పరిస్థితి విన్నాక చాలా బాధేసింది.. ’ అని భువనేశ్వరి చెప్పింది.