పొరుగుదేశం పాకిస్తాన్ ఆర్ధికంగా దివాళా తీసే పరిస్థితుల్లో ఉంది. ప్రజలకు కనీసం తిండి పెట్టలేని పాకిస్తాన్.. సైన్యానికి మాత్రం దండిగా నిధులు కేటాయిస్తూ వస్తోంది. దరిద్ర దేవత నెత్తిమీద తాండవిస్తున్నా అణుబాంబులు ఉన్నాయని పదే పదే చెప్పుకుంటూ వస్తోంది. పెట్రోల్ దిగుమతులకు డాలర్లు లేని పాకిస్తాన్ ఉన్నకొద్ది డాలర్లతో తాజాగా తన నేవీతో విన్యాసాలు చేయడానికి నిర్ణయించింది. ‘ఎక్సర్‌సైజ్ అమన్’ పేరుతో ప్రతిష్టాత్మకంగా శుక్రవారం నుంచి నిర్వహించే ఈ విన్యాసాల్లో పాల్గొనాలని 110 దేశాలను ఆహ్వానించింది. కానీ, కేవలం 7 దేశాలు మాత్రమే పాక్ ఆహ్వానాన్ని మన్నించాయి. అమెరికా, చైనా, శ్రీలంక, మలేషియా, ఇటలీ, జపాన్ దేశాలు మాత్రమే తమ నౌకలను పంపాయి. టర్కీ మిత్రదేశమే అయినప్పటికీ భూకంపాల ప్రభావంతో రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో పాక్ పరువు మరోసారి దారుణంగా పోయినట్టయింది. ఓ వైపు ఆర్ధికంగా చితికిపోతున్నా దాన్ని ఆదేశం పట్టించుకోవడం లేదు. దేశంలో ఆయిల్ నిల్వలు అడుగంటిపోతున్నాయి.
లాహోర్‌లో పెట్రోల్ లేక 70 శాతం బంకులు మూతపడ్డాయి. ఇక ఇన్నాళ్లు ఆదుకున్న చైనా, అరబ్ దేశాలు ఇప్పుడు మొఖం చాటేయడంతో ఐఎంఎఫ్ ముందు పాక్ మోకరిల్లింది. కానీ అది పెట్టే షరతులు ఒప్పుకోకపోవడంతో ఒప్పందం కుదర్లేదని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రెండు షరతులకు పాక్ అభ్యంతరం చెప్పిందని తెలుస్తోంది. ఒకటి సైన్యానికి బడ్జెట్ తగ్గించడం, రెండు ఆ దేశంలోని రాజకీయ నాయకుల ఆస్తి వివరాలను బహిరంగంగా వెల్లడించడం. ఈ రెండు చేస్తే లోన్ ఇస్తామని ఆఫర్ చేసిందంట. కానీ ఈ రెండు పనులు చేస్తే వచ్చే పరిణామాలు దారుణంగా ఉంటాయని తెలిసి వెనకడుగు వేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.