Only the name has changed, the symbol is the same: KCR
mictv telugu

పేరు మాత్రమే మార్పిడి, గుర్తు అదే: కేసీఆర్

October 3, 2022

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీకి సంబంధించిన చర్చలే జరుగుతున్నాయి. కేసీఆర్ జాతీయ పార్టీకి ఏ పేరు పెడతారు? పార్టీకి కొత్త గుర్తు ఏదీ ఉంటుంది? కారు గుర్తే ఉంటుందా? లేక కొత్త గుర్తు పెడతారా? జెండా ఏదీ ఉంటుంది? అనే తదితర విషయాలపై కార్యకర్తలు, స్థానిక ప్రజలు, రాజకీయ విశ్లేషకులు తెగ చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రుల సమావేశంలో కేసీఆర్..జాతీయ పార్టీకి సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలను వెల్లడించారు.

కేసీఆర్ మాట్లాడుతూ.. ”విజయదశమి రోజు (అక్టోబర్ 5న) మధ్యాహ్నం 1: 19 గంటలకు జాతీయ పార్టీ ఏర్పాటును ప్రకటిస్తాం. దానికి బీఆర్ఎస్ తదితర పేర్లను పరిశీలిస్తున్నాం. 5వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో 283 మంది సభ్యులు జాతీయ పార్టీ ఏర్పాటును ఆమోదిస్తూ, ఏకగ్రీవ తీర్మానం చేస్తారు. అనంతరం పార్టీ పేరును ప్రకటిస్తాం. మునుగోడు ఉపఎన్నికల్లో జాతీయ పార్టీగానే పోటీ చేస్తాం. అయితే, టీఆర్ఎస్‌నే జాతీయ పార్టీగా పేరు మారుస్తున్నాం. పేరు మార్చుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకొని, ఆమోదం పొందుతాం. గతంలో జనసంఘ్, అన్నాడీఎంకే, టీఎంసీలు ఇలాగే జాతీయ పార్టీ హోదా పొందాయి. జాతీయ పార్టీకి కారు గుర్తే యథాతథంగా ఉంటుంది. గులాబీ రంగు జెండాయే ఉంటుంది. మధ్యలో తెలంగాణ బదులు భారతదేశ పటం ఉంటుంది. ” అని ఆయన వివరణ ఇచ్చారు.

అయితే, దసరా రోజునే మంచి ముహూర్తం ఉండడంతో అదే రోజున కొత్త పార్టీని ప్రకటిస్తామని కేసీఆర్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. అనంతరం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, గ్రంథాలయ సంస్థల చైర్ పర్సన్లు అంతా కలిసి 283 మంది సభ్యులు కలిసి తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు, ఈ సమావేశానికి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు తమిళనాడు, మహారాష్ట్రల నుంచి కొన్ని పార్టీల నేతలు, ఢిల్లీ, యూపీల నుంచి రైతు నేతలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.