గ్రేటర్ హైదరాబాద్‌లో 17 మేజర్ పార్కులు ఉన్నాయి. వీటిని ప్రతిరోజు వేలాది మంది నగరవాసులు సందర్శించి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. పార్కుకు వచ్చే వారికి మరింత సౌలభ్యం కలిగించేలా ప్రధాన పార్కులలో వినూత్నంగా ఓపెన్ జిమ్‌లను ఏర్పాటుచేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనిలో భాగంగా మొదటి దశలో ఆరు ప్రధాన పార్కుల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేసింది. దాదాపు 50 లక్షల 60 వేల వ్యయంతో ఈస్ట్‌జోన్ పరిధిలోని డాక్టర్ ఏ.ఎస్.రావు పార్కు, వెస్ట్‌జోన్ పరిధిలోని గుల్మొహర్ పార్కు, సౌత్‌జోన్ పరిధిలోని ఇమ్లీబన్ పార్కు, సెంట్రల్ జోన్ పరిధిలోని ఇందిరాపార్కు, కృష్ణకాంత్ పార్కు, నార్త్‌జోన్ పరిధిలో నెహ్రూనగర్ పార్కులలో ఈ ఔట్‌డోర్ ఓపెన్ జిమ్‌లను ఏర్పాటుచేసింది. దీంతో వాకింగ్‌కు వచ్చే నగరవాసులకు ఆధునిక జిమ్ పరికరాలను వినియోగించుకోవడం ద్వారా పూర్తి ఫిట్ నెస్ తో ఉండటానికి దోహదపడుతున్నాయి.
ఈ జిమ్‌లలో లెగ్ప్రెస్, లెగ్స్ట్రెచ్ స్ట్రేట్, లెగ్స్ట్రెచ్ సైడ్స్, చెస్ట్ పుష్, ట్విస్టర్లు, పెండ్యులం, వర్టికల్ షోల్డర్హుల్, అబ్డామినల్ రైడర్, షోల్డర్ ఫ్లై, రోవర్, క్రాస్‌ట్రైనర్, షోల్డర్ ఫిస్ట్, సీటర్క్విస్టర్, ఏబి బోర్డ్, టైచై తదితర ఆధునిక జిమ్ పరికరాలను ఏర్పాటు చేశారు. ఈ ఓపెన్ జిమ్‌లను నగరవాసులు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారని, వీటిని ఇతర ప్రధాన పార్కుల్లో కూడా దశలవారీగా ఏర్పాటు చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్ధన్ రెడ్డి తెలియజేశారు. ప్రైవేట్ జిమ్‌లలో కేవలం గంటసేపటికి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటుచేసి ఆధునిక పరికరాలను ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉందని పలువురు వాకర్స్ అభిప్రాయపడ్డారు.