Open letter to parties leaders attending brs first public meeting khammam
mictv telugu

బీఆర్ఎస్ సభ.. కేసీఆర్ నియంత అంటూ నేతలకు బహిరంగ లేఖ

January 18, 2023

Open letter to parties leaders attending brs first public meeting khammam

ఖమ్మంలో జరుగుతున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సభలో పలు పార్టీల నేతలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ నుంచి ఢిల్లీ, పంజాబ్ సీఎంలు, సీపీఎం నుంచి కేరళ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ నుంచి యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పౌరసమాజం పేరుతో కొందరు మేధావులు, ప్రజాస్వామ్యవాదులు లేఖాస్త్రం సంధించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతూ నిరంకుశ పాలన సాగిస్తోందని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాలను దేశం దృష్టికి తీసుకెళ్లాలని సభకు హాజరైన పార్టీల నేతలను కోరారు. బహిరంగ లేఖ యథాతథంగా..

భారత రాష్ట్ర సమితి (BRS) ఆవిర్భావ సభ జనవరి 18 న ఖమ్మం పట్టణంలో జరగనుంది. ఈ ఆవిర్భావ సభకు ఆ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తున్నది. సభకు కనీసం 5 లక్షల మంది ప్రజలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో పాటు, సభకు కాంగ్రే సేతర , బీజేపీ యేతర పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నది.

ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ డిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్య మంత్రులను , CPI (M) పార్టీకి చెందిన కేరళ రాష్ట్ర ముఖ్య మంత్రిని సభకు ఆహ్వానించింది. సిపిఐ , సమాజ్ వాదీ పార్టీల నాయకులు , ఇతర రాష్ట్రాల పార్టీల నాయకులు కొందరు కూడా ఈ సభకు హాజరవుతున్నారు. రాష్ట్ర సిపిఐ ,సిపిఎం పార్టీల నాయకులు కూడా సభా వేదికపై ఉండబోతున్నారు.
రాష్ట్రంలో “భారాస” పార్టీ ప్రభుత్వం ప్రజల పట్ల నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తున్నది. .పాలనలో అప్రజాస్వామిక ధోరణులు, అవినీతి ఈ ప్రభుత్వ పాలన నిండా ఉన్నాయి. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోవడానికి ఈ ప్రభుత్వ అవినీతి, తప్పుడు విధానాలే ప్రధాన కారణం గా ఉన్నాయి .
ఈ సందర్భంగా తెలంగాణా ప్రజల గుండె ఘోషను బహిరంగ లేఖ రూపంలో భారాస ఆవిర్భావ సభకు వస్తున్న వివిధ రాజకీయ పార్టీల నాయకుల దృష్టికి తేవాలని భావిస్తున్నాము. ఈ లేఖలో తెలంగాణా ప్రభుత్వ పరిపాలనా తీరు, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉల్లంఘించిన తీరు, సామాజిక న్యాయానికి భిన్నంగా తీసుకుంటున్న నిర్ణయాలు, వివిధ ప్రాజెక్టులలో భారీగా సాగుతున్న అవినీతి – తదితర వాస్తవ విషయాలను ఈ పార్టీల ముందు పెట్టడం ద్వారా దేశ ప్రజల దృష్టికి తీసుకు వెళ్లాలని మేము భావిస్తున్నాం.

1. ఫక్తు రాజకీయ పార్టీ గా మారిన భారాస పార్టీ :

తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం కోసం తెలంగాణా ప్రజలు సాగించిన సుదీర్ఘ ఉద్యమంలో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తెలంగాణా రాష్ట్ర సమితి (ప్రస్తుతం భారాస) , 2014 లో మొదటి విడత ఎన్నికలలో గెలిచి తనను తాను ఫక్తు రాజకీయ పార్టీగా స్వయంగా ప్రకటించుకుంది. 2018 లో రెండవ విడత ఎన్నికలలో గెలిచిన తరువాత, ప్రతిపక్ష పార్టీల శాసన సభ్యులను అనైతికంగా తన పార్టీలో చేర్చుకుంది . గ్రామ స్థాయి నుండీ ,రాష్ట్ర స్థాయి వరకూ అన్ని పార్టీల వారినీ భారాస లో చేర్చుకోవడంలో భాగంగా అనేక అనైతిక పద్ధతులు అనుసరించింది .
అన్ని స్థాయిలలో ఎన్నికలను పూర్తి స్థాయి వాణిజ్య కార్యక్రమం గా ఈ పార్టీ మార్చేసింది . ఎన్నికలలో గెలవడానికి మద్యం, డబ్బు పంపిణీ ని దేశంలో ఎక్కడా లేనంతగా అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్ళింది.

2. ప్రజల ఆకాంక్షలకు తూట్లు:

భారాస పార్టీ గత ఎనిమిదేళ్లుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది. రెండు విడతల ఎన్నికల లోనూ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది . కొన్ని హామీలను అమలు చేసింది . అనేక హామీలను ఇప్పటికీ అమలు చేయలేదు. మరీ ముఖ్యంగా ఈ ప్రభుత్వ పరిపాలనకు, అభివృద్ధి నమూనాకు పేద ప్రజలు కేంద్రంగా లేరు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు, అభిప్రాయాలకు విలువ లేదు. ప్రజలకు చట్టబద్ధ హక్కులుగా దక్కాల్సినవి ఏవీ దక్కడం లేదు.
“నీళ్ళు,నిధులు,నియామకాలు” నినాదంతో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన తెలంగాణా ప్రజల ఆకాంక్షలకు తూట్లు పొడుస్తూ, ఈ ప్రభుత్వం తనకు తోచినట్లుగా పథకాలను,ప్రాజెక్టులను ప్రకటించి అమలు చేస్తూ నిధులను దుర్వినియోగం చేస్తున్నది. సాగు నీళ్ళ విషయంలో తప్పుడు పద్ధతిలో డిజైన్లు రూపొందించి ఎత్తి పోతల పథకాల పేరుతో తిప్పిపోతల పథకాలను నిర్మించింది

మరో వైపు రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయక పోవడం వల్ల, ప్రైవేట్ సంస్థలలో ,పరిశ్రమలలో స్థానికులకే ఉపాధి అవకాశాలు దక్కక పోవడం వల్లా లక్షల మంది నిరుద్యోగులు పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు . నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతిని చెల్లిస్తామనే హామీని ఇప్పటి వరకూ అమలు చేయలేదు.
ప్రజలు రాష్ట్ర ముఖ్య మంత్రి గారిని కలసి కనీసం తమ గోడు చెప్పుకునే స్థితి కూడా లేదు .ఆయా శాఖల మంత్రులకూ,శాసన సభ్యులకూ గొంతు విప్పి మాట్లాడే స్వేచ్చా , తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల , రంగాల సమస్యలను పరిష్కరించగలిగిన అధికారాలు లేక సంవత్సరాల తరబడి ప్రజల సమస్యలు పెండింగ్ లో ఉంటున్నాయి.

4. ప్రజల ప్రజాస్వామిక హక్కులపై దాడి:

ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజల,ప్రజా సంఘాల కదలికలపై రాష్ట్రం లో నిఘా, ఆంక్షలు కొనసాగుతున్నాయి . దశాబ్ధాలు గా ప్రజల సమస్యలపై పోరాట కేంద్రంగా ఉండిన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ను రద్ధు చేసిన ఈ ప్రభుత్వం కోర్టు తీర్పు తరువాత మాత్రమే అక్కడ ధర్నాలకు అలవి కాని షరతులతో అనుమతిస్తున్నది . తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం జరిగిన వెంటనే ప్రజల సమస్యలపై పోరాడుతున్న, ప్రత్యేక తెలంగాణా ఉద్యమ కాలమంతా తెలంగాణా జేఏసీ ఛైర్మన్ గా పని చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఇంటి తలుపులు బద్ధలు కొట్టి ఆయనను అరెస్టు చేసింది.

ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు పర్యటనకు వెళ్ళిన జిల్లాలలో ప్రజా సంఘాల కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. తాజా ఖమ్మం బహిరంగ సభ సందర్భంగా కూడా న్యూ డెమాక్రసి పార్టీ, ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజా సంఘాల, హక్కుల సంఘాల కార్యకర్త లపై UAPA కేసులు బనాయించారు. ఇవన్నీ ఈ ప్రభుత్వ అప్రజాస్వామిక పాలనా ధోరణులకు నిదర్శనం . ఇప్పుడు ఇదే నిర్బంధ కాండను దేశమంతా భారాస ఆధ్వర్యంలో విస్తరిస్తారా ? అన్నది భారాస పార్టీ నాయకత్వం ఖమ్మం సభలో స్పష్టం చేయాలి,
“భారాస”కు సంఘీభావం ప్రకటించడానికి ఖమ్మం సభకు వచ్చిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈ ప్రభుత్వ పాలనా సంస్కృతిని, నిర్భంధ విధానాలను ఆమోదిస్తున్నారా అన్నది తెలంగాణా రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాలి.

5. తెలంగాణా లో అమలవుతున్న వ్యవసాయ రంగ పథకాలపై :

భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ ప్రకటన రోజు “అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్ “ అనే ప్రకటన ఇచ్చింది తెలంగాణా లో జరిగిన పార్టీ సమావేశం . తెలంగాణా రాష్ట్ర రైతుల సంక్షేమం కోసం తాము బాగా కృషి చేశామని, ఫలితాలు సాధించామని ,ఇవే ఫలితాలను దేశమంతా అమలు చేసి దేశ రైతాంగానికి న్యాయం చేస్తామని ప్రకటించారు .
సాధారణంగా తెలంగాణా కు దూరంగా ఉన్న వాళ్ళకు తెలంగాణా లో అమలవుతున్న వ్యవసాయ రంగ పథకాల గురించి సహజం గానే ఆసక్తి కలుగుతున్నది . ఈ రాష్ట్రంలో అమలవుతున్న సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం , రైతు బంధు, రైతు బీమా పథకాలకు భారాస పార్టీ ఎక్కువ ప్రచారం కల్పిస్తున్నది. ఈ రాష్ట్రంలో అమలవుతున్న ఈ పథకాలు తప్పకుండా రైతులకు అవసరమైనవే. సరైన మార్గదర్శకాలు రూపొందించి అమలు చేస్తే తప్పకుండా ఇవి రైతు కుటుంబాలకు ఉపయోగ పడతాయి.

కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతు బంధు పథకానికి కేటాయిస్తున్న 14 వేల కోట్ల నిధులలో, 22 లక్షల కౌలు రైతుల కుటుంబాలకు, లక్షల మంది ఆదివాసీ పోడు రైతులకు, భూమిపై పట్టా హక్కులు లేని మహిళా రైతులకు ఒక్క రూపాయి కూడా అందడం లేదు. పైగా ఈ నిధుల నుండీ వ్యవసాయం చేయని వారికి, వ్యవసాయం చేయని భూములకు ఎక్కువ సహాయం అందిస్తూ , నిధులను దుర్వినియోగం చేస్తున్నారు.

రాష్ట్రంలో కౌలు రైతులను గుర్తించడానికి చట్టం ఉన్నా ఈ ప్రభుత్వం ఆ చట్టాన్ని అమలు చేయడం లేదు. కౌలు రైతులు తమ అజెండా లో లేరని రాష్ట్ర ముఖ్య మంత్రి గారు అసెంబ్లీ లోనే ప్రకటించారు.
కౌలు రైతుల పట్ల ఈ ప్రభుత్వ ధోరణిని భారాస సభకు సంఘీభావంగా వచ్చిన సిపిఐ , సీపీఏం, ఆమ్ ఆద్మీ , ,సమాజ్ వాదీ పార్టీలు బలపరుస్తాయా ? SC, ST, BC కులాలకు, వర్గాలకు చెందిన కౌలు రైతుల పట్ల భారాస పార్టీ సామాజిక వివక్ష, రాజ్యాంగ వ్యతిరేక వైఖరి చూపెడుతుంటే ఈ పార్టీలు ఆమోదిస్తాయా? స్పష్టం చేయాలి.

మరీ ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో కుటుంబ శ్రీ పథకాన్ని అమలు చేస్తూ , మహిళా రైతులకు కౌలు భూములు ఇప్పిస్తున్నారు. భూ యజమానులకు, కౌలు రైతులకూ మధ్య గ్రామ పంచాయితీలు మధ్య వర్తిగా వ్యవహరిస్తున్నాయి. కౌలు రైతులు తీసుకునే బ్యాంకు ఋణాలకు కూడా వడ్డీ రాయితీ అమలు చేస్తున్నారు. భారాస ఆవిర్భావ సభలో పాల్గొంటున్న కేరళ రాష్ట్ర ముఖ్య మంత్రి గారు. తెలంగాణా రాష్ట్ర ముఖ్య మంత్రిగా కేసీఆర్ ఈ రాష్ట్రంలో కౌలు రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు మద్ధతు ఇస్తారా ? ఈ ప్రభుత్వ తప్పుడు వైఖరిని ప్రశ్నిస్తారా ?

లెఫ్ట్ పార్టీలకు అనుబంధంగా పని చేస్తున్న రైతు, కౌలు రైతు సంఘాలు , కేసీఆర్ వైఖరికి వ్యతిరేకంగా కౌలు రైతుల పక్షాన పోరాటాలు నిర్మిస్తే ఆ పార్టీల నాయకత్వం బల పరుస్తుందా? కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటాలు ఏమిటని అడ్డుకుంటుందా ? రాష్ట్ర ప్రజలకు ఖమ్మం సభలో ఈ పార్టీల నాయకులు స్పష్టం చేయాలి .
రైతు బీమా పథకం కూడా కేవలం భూమిపై పట్టాహక్కులు కలిగిన వారికే పరిమితమైంది. భూమి లేని కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు, ఇతర గ్రామీణ పేదలకు ఉపయోగ పడడం లేదు. ఈ పథకాన్ని మొత్తం గ్రామీణ కుటుంబాలకు విస్తరించాలని ఈ పార్టీలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడిగి ఒప్పిస్తాయా ?
రెండు విడతల ఎన్నికలలో ఇచ్చిన ఋణ మాఫీ హామీలు కూడా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సరిగా అమలు చేయక పోవడం వల్ల రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి అధిక వడ్డీల భారాన్ని మోస్తున్నాయి.

రాష్ట్రంలో 2014 నుండీ 2021 వరకూ 6700 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు . కానీ ఈ ఆత్మహత్యలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదు .
జీవో 194 ప్రకారం ఈ కుటుంబాలకు 6 లక్షల రూపాయల పరిహారం చెల్లించాల్సి ఉన్నా, ఇప్పటి వరకూ కేవలం 1600 కుటుంబాలకు మాత్రమే పరిహారం అందించింది. మిగిలిన కుటుంబాలకు కూడా పరిహారం అందించాలని భారాస పార్టీని , రాష్ట్ర ప్రభుత్వాన్ని లెఫ్ట్ పార్టీలు ఒప్పిస్తే ఆయా కుటుంబాలకు మేలు చేసిన వారు అవుతారు.
2020 ఖరీఫ్ నుండీ రాష్ట్రంలో పంటల బీమా పథకాల అమలును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిలిపి వేసింది. 2020 నుండీ భారీ వర్షాల వల్ల నష్ట పోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా సహాయం అందడం లేదు .

ఈ విషయంలో రైతులకు అనుకూలంగా రాష్ట్ర హై కోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకుండా ప్రభుత్వం సుప్రీమ్ కోర్టుకు అప్పీల్ కు వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. సుప్రీం కోర్టు నుండీ అప్పీల్ ను ఉపసంహరించుకుని ,ప్రకృతి వైపరీత్యాలకు నష్ట పోయిన రైతులకు పరిహారం చెల్లించేలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ పార్టీలు ఒప్పిస్తాయా ?

6. దళిత కుటుంబాలకు అందని సాగు భూమి, ఆదివాసీ పోడు రైతులకు అందని పట్టాలు, భూ సేకరణ విధానం, ధరణి పోర్టల్ ద్వారా రైతులకు అన్యాయం :

రాష్ట్రంలో భూమి లేని దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి కొనుగోలు చేసి ఇస్తామనే పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు గడిచినా ఆదివాసీ పోడు రైతులకు పట్టా హక్కులు ఈ ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు. మరో వైపు పారిశ్రామిక రంగ అభివృద్ధి , నగరాల మాస్టర్ ప్లాన్ పేరుతో రెండు పంటలు పండే రైతుల భూములను ,అసైన్డ్ భూములను ఈ ప్రభుత్వం గుంజుకుంటున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ధరణి పోర్టల్ కూడా రైతుల పాలిత శాపంగా మారింది.

రాష్ట్ర ప్రభుత్వ భూ సేకరణ విధానాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా కామారెడ్డి , జగిత్యాల మాస్టర్ ప్లాన్ లకు వ్యతిరేకంగా, NIMZ, ఫార్మా సిటీ ,రీజనల్ రింగ్ రోడ్డు , ఇతర ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నారు. రైతులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం తో వేదిక పంచుకోవడం ద్వారా, ఈ పోరాడుతున్న ప్రజలకు ఖమ్మం సభలో పాల్గొంటున్న లెఫ్ట్ పార్టీలు ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నాయో స్పష్టం చేయాలి.

7. అప్పులు , అవినీతి మయం విద్యుత్ సాగు నీటి రంగాలు :

ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న డిల్లీ ,పంజాబ్ రాష్ట్రాల ప్రజల శ్రేయస్సుకోసం విద్యుత్తు పరంగా అనేక చర్యలు తీసుకున్నదని మనం వింటున్నాం. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్తును అందించడంతో పాటు, ప్రైవేటు విద్యుత్ సంస్థల దోపిడీని నియంత్రించడానికి పటిష్ట చర్యలు తీసుకున్నట్టుగా పేర్కొంటున్నారు. ఉద్యోగుల అవినీతిని నియంత్రించడానికి కూడా చర్యలు తీసుకున్నట్టు చెబుతున్నారు. మరోవైపు డిస్కమ్ లు దివాళా తీయకుండా సరఫరా, పంపిణీ వ్యవస్థలను ఆర్ధికంగా పటిష్ట పరచే చర్యలు కూడా తీసుకున్నట్టు తెలుస్తున్నది.
మొత్తం మీద విద్యుత్తు రంగాన్ని ఒక గాటిలో పెట్టడంతో పాటు, పేద, మధ్య తరగతి పై భారాలు పడకుండా మీరు తీసుకుంటున్న చర్యలను మేము ఆహ్వానిస్తున్నాం.

అయితే తెలంగాణలో జరుగుతున్నదేమిటి?
ఎనిమిదేళ్ళ కేసీఆర్ పాలనలో విద్యుత్ రంగం దివాళా తీసింది. విద్యుత్తు, సాగునీటి రంగాలలో అవినీతి తాండవిస్తున్నది. ప్రభుత్వ రంగం ముసుగులో తెలంగాణ రాజకీయ నాయకులు చేస్తున్న అవినీతితో తెలంగాణ విద్యుత్, సాగునీటి రంగాలు కుదేలయ్యాయి. విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్ వెబ్ సైట్ పై ఉన్న సమాచారం ప్రకారం 2021 నాటికి విద్యుత్ సంస్థల ఆర్ధిక నష్టాలు 45 వేల కోట్ల రూపాయలను దాటాయి.

2022 నాటికి ప్రభుత్వ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలే 21 వేల కోట్ల రూపాయలు దాటాయి. ప్రభుత్వం సకాలంలో ప్రభుత్వ ఖజానా నుండి అవసరమైన మేరకు సబ్సిడీలు చెల్లించక, విద్యుత్ సంస్థలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఉద్యోగుల జీతాలు చెల్లించడానికే మళ్ళీ అప్పులు చేయాల్సిన దుస్తితి తెలంగాణలో నెలకొన్నది.
2022 లో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 6000 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారులపై వేసి నడ్డి విరిచారు. అది చాలదన్నట్టు, ఇప్పుడు ట్రూ-అప్ పేరుతో మరో 16 వేల కోట్ల రూపాయల కరెంటు భారాన్ని ప్రజలపై వేసేందుకు తెలంగాణ రెగ్యులేటరీ కమిషన్ ముందు తమ ప్రతిపాదనలను ప్రభుత్వం ఉంచింది.
సాగునీటి రంగంలో తెలంగాణలో జరుగుతున్న అవినీతి ప్రపంచ చరిత్రలో ఎక్కడా కానరాదు.
లక్షల కోట్ల కాంట్రాక్టులలో 90 శాతం పనులు నియమాలకు విరుద్దంగా కేవలం ఒకే ఒక కాంట్రాక్టరుకు దక్కాయి. ప్రతీ పనిలో అవినీతి, నాణ్యతా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. కాళేశ్వరం పేరుతో కట్టిన ఎత్తిపోతల పధకం పంపు హౌజులు చిన్న పాటి వరదకే మునిగిపోయాయి. వాటి రిపేరు ఖర్చులు కూడా కాంట్రాక్టరుతో పెట్టించకుండా, మళ్ళీ రిపేర్లలో కూడా వందల కోట్ల అవినీతి జరుగుతున్నది.

ఈ సాగునీటి ప్రాజెక్టుల కోసం సుమారు 2 లక్షల ఎకరాలకు పైగా భూమిని సరైన పరిహారం ఇవ్వకుండా రైతుల వద్ద బలవంతంగా గుంజుకున్నారు. ఇందులో అత్యధిక భూములు పేద, బలహీనవర్గాలకు చెందిన వారివే. ఎత్తిపోతల పధకాలతో ఒక ఎకరాకు ఒక పంటకు నీటిని ఎత్తిపోయాలంటే సగటున లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే వచ్చే ఏడాది నుండి ఏటా బ్యాంకులకు చెల్లించాల్సిన అసలు, వడ్డీ రూ 13,500 కోట్ల రూపాయలు. ఈ ఖర్చుకు అదనంగా కరెంటు ఖర్చు వేల కోట్ల రూపాయలలో ఉంటుంది. ఖర్చు ఈ ష్టాయిలో ఉండడానికి కారణం ప్రాజెక్టులకు దాపురించిన రాజకీయ అవినీతే.
లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు కేవలం ఒక్కరో, ఇద్దరో కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారు. వాస్తవ ఖర్చును 300 నుండి 400 శాతం వరకు పెంచి చూపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలలో పారదర్శకత లేదు. ఏ జీవో కూడా ప్రజలకు అందుబాటులో ఉండదు. సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేశారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నవారిపై తీవ్ర నిర్బందం అమలు చేస్తున్నారు.

ప్రభుత్వ రంగం పేరుతో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నదంతా అవినీతి, అక్రమాలే…! చివరికి ప్రైవేటు రంగం కూడా ఈ స్థాయిలో ప్రజలను దోపిడీ చేయడం మనం చూడము. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, రైతు అనుకూల విధానాల పేరుతో కేసీఆర్ చేస్తున్నదంతా ఒక నాటకం.
“కేసీఆర్ ప్రభుత్వం దేశం మొత్తంలోనే అత్యంత అవినీతికర ప్రభుత్వం” అని ఇటీవలి కాలంలో తెలంగాణలో పర్యటించిన ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర బాధ్యుడు ప్రకటించినప్పుడు, మీరు అవినీతికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల పోరాటానికి అండగా నిలుస్తారని భావించాము. కానీ నెల తిరక్కముందే, అదే అవినీతి ప్రభుత్వ పెద్దలతో మీరు అంటకాగడం, వేదికను పంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఈ ఒక్క చర్యతో మీ చిత్తశుద్దిపై కూడా తెలంగాణ ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలపై చేస్తున్న మీ పోరాట నిబద్దతను కూడా శంకించాల్సి వస్తుంది. కాబట్టి ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఉంది,

8. తెలంగాణా లో విద్యా రంగ దుస్థితి :

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం డీల్లీ రాష్ట్రంలో విద్యా రంగం లో అనుసరిస్తున్న విధానాలను అందరూ అభినందిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అన్ని రాష్ట్రాలలో ఒక ప్రధాన విజయం గా డిల్లీ విద్యా రంగ మోడల్ ను ప్రచారం చేసుకుంటున్నది. కానీ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం విద్యా రంగాన్ని (ప్రభుత్వ రంగంలో స్కూల్ విద్య , యూనివర్సిటీ విద్య) ధ్వంసం చేసింది. మౌలిక సదుపాయాల కల్పన , టీచర్ పోస్టుల భర్తీ లాంటి విషయాలలో, విద్యా ప్రమాణాలలో దేశంలోనే అట్టడుగు స్థానాలలో ఉంటున్నది . గత 8 ఏళ్లలో విద్యా రంగ బడ్జెట్ గణనీయంగా తగ్గిపోయింది.
ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరులే దీనికి ప్రధాన కారణం. భారాస పార్టీ ఆవిర్భావ సభకు విచ్చేస్తున్న డీల్లీ ,పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భారాస ప్రభుత్వాన్ని విద్యా రంగం విషయంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమని అభినందిస్తుంది . తెలంగాణా మోడల్ ను దేశ వ్యాప్తం చేయమని సలహా ఇస్తుందా ? స్పష్టం చేయాలి.

మిత్రులారా,

భారాస పార్టీ ఆవిర్భావ సభ దేశ భవిష్యత్తును ఏ మాత్రం ప్రభావితం చేస్తుందో తెలియదు కానీ భారాస ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించి , ప్రజల పక్షాన పోరాడాల్సిన రాజకీయ పార్టీలు, కొన్ని రైతు సంఘాలు ఈ సభలో పాల్గొనడం ద్వారా కొనసాగుతున్న నిరంకుశ పాలనకు మద్ధతు ఇచ్చి, తెలంగాణా ప్రజల భవిష్యత్తుకు మాత్రం నష్టం చేస్తాయని మాత్రం స్పష్టం చేయదల్చుకున్నాం.
ఈ నేపధ్యంలో భారాస ప్రజా వ్యతిరేక విధానాలను ఓడించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీదా, ప్రజల పక్షాన నిలబడే రాజకీయ పార్టీల మీదా, ప్రజా సంఘాల మీదా ఉందని మేము భావిస్తున్నాము .