తాజ్‌మహల్‌లో తాళం వేసి ఉన్న 22 గదులను తెరవాలని.. వాటిపై ఏఎస్ఐతో విచారణ జరిపించాలని అలహాబాద్ హైకోర్టులో శనివారం బీజేపీ నేత ఒకరు పిటీషన్ దాఖలు చేశారు. ఆ గదుల్లో హిందూ దేవుళ్ల విగ్రహాలు, శాసనాలు ఉన్నాయేమో తెలుసుకోవాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించాలని బీజేపీ అయోధ్య మీడియా ఇన్‌ఛార్జి డాక్టర్ రజనీశ్ సింగ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేసి, ఫలితంగా వచ్చే నివేదికను కోర్టుకు సమర్పించేలా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరినట్లు తెలిపారు. ఈ గదులను తెరచి వాటిలో ఏం ఉందో తెలుసుకుంటే వివాదాలు పరిష్కారమవుతాయని, దీనివల్ల ఎటువంటి హాని జరగబోదని అన్నారు.
కాగా గత కొంతకాలంగా తాజ్‌మహల్.. షాజహాన్, ముంతాజ్ ప్రేమల స్మారకం కాదని ఒకప్పటి హిందూ దేవాలయమని ప్రచారంలో ఉంది. అయితే అసలు నిజాలు తెలియాలంటే తాజ్ మహల్‌లోని కింది రెండు అంతస్థుల్లో తాళం వేసి ఉన్న 22 గదులను కోర్టు సమక్షంలో తెరవాలని రజనీశ్ సింగ్ వాదన. తాజ్‌మహల్ ఓ పురాతన శివాలయం అని ఆయన చెబుతున్నారు. మొఘలుల నాటి కట్టడమైన తాజ్‌మహల్ ‘ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ సంరక్షణలో ఉంది.