Operation Rs100 Impact On People
mictv telugu

ఆపరేషన్ వంద రూపాయలు..అవాక్కయ్యే నిజాలు..!

October 29, 2022

వాళ్లు ఎర వేశారు.వీళ్లు ఓకే అన్నారు. ఒక్కరికి వంద రూపాయలు…మిగతా వారికి 50 రూపాయలన్నారు. ఇవీ నిజంగా వంద, యాభై రూపాయలు కాదు…వందకోట్లు, 50 కోట్ల రూపాయలు.అక్షరాల రెండు వందల కోట్లు.మరో నలుగురు ఎమ్మెల్యేలకు కలిపి తలో 50 కోట్లు.మొత్తం నాలుగు వందల కోట్లు.ఇంకేంతమంది వస్తే అంతమందిని తీసుకుంటాం. తలో యాభై కోట్లు.తగ్గేదేలే అంటూ డీల్ కొచ్చారు. ఇవ్వడానికి వాళ్లెవరు?తీసుకొవడానికి వీళ్లెవరు?ఎవరి సొమ్ముఅని పంచేస్తారు.?ఇది జనం సొమ్ము.స్కామ్‌లు,స్కీమ్‌ల పేరిట పక్కాదారి పట్టించిన కరెన్సీ కట్టలే కదా.సంతల్లో కూరగాయలుగా ఎమ్మెల్యేలకు కోట్లల్లో బేరం పెట్టారు. ఏ నాయకుడు జేబు నుంచి ఇన్ని వందల కోట్ల డబ్బుతేరు. ఆఖరుకు వాళ్ల ఎలక్షన్‌కు ఖర్చు పెట్టాలన్నా పార్టీ ఫండ్ ,,,లేదా మరోచోట ఇప్పించాల్సిందే. అలాంటోళ్లకి ఇప్పుడు వందల కోట్లు ఎలా వచ్చాయి?ఇది పక్కా జనం సొమ్ము అని ఇట్టే అర్థమవుతోంది.

నోట్లు నడిపిస్తున్నాయ్

నోట్లు రాజకీయాల రాత మార్చేస్తున్నాయి. దశ దిశను డైవర్ట్ చేస్తున్నాయి. అసలే ఆకలి మీద వున్న నేతలకు ఆశపెడుతున్నాయి.లాజిక్ లేకుండా నోట్ల మ్యాజిక్‌కు బోల్తాపడేస్తున్నారు. పంచామా..గెలిచామా..సంపాందించామా…ఇప్పుడు ఇవే ప్రతి నేత చుట్టూ వైఫై లా తిరుగుతున్నాయి. ఒక్కసారి కుర్చీ దొరికిందంటే లైప్ లాంగ్ సరిపడినంతా సర్దేస్తున్నారు. కాంట్రాక్టులు, డీల్స్ , సెటిల్‌మెంట్లు, రియల్ దందాలకు తెరలేపుతున్నారు. ఒక్కసారి కమిట్ అయితే కరెన్సీ మాటే వింటారు.కళ్లు తెరిస్తే కరెన్సీ,కళ్లు మూస్తే కరెన్సీ..ఏ పనిచేయాలన్న నాకెంత…నీకెంత..అందులో ఏదైనా ఆయనకు వుంటేనే ఫైలు కదులుతుంది.లేదంటే పరేషాన్ తప్పదు.ప్రస్తుతం వందకు 70శాతం మంది నేతలు ఇలాగే తయారయ్యారు.గల్లీ నుంచి ఢిల్లీదాకా ఇంతే.

మేనిఫెస్టో కాదు మనీఫెస్టో..

ప్రజలు గెలిపించారు. చట్టసభల్లోకి వచ్చాం. అద్భుతమైన అవకాశం వచ్చిందన్న సోయి వుండదు. ఇచ్చిన హామీలు గుర్తుకురావు,జనం బాధలు,కన్నీళ్లు కళ్లముందు ఆడవు.పార్టీ మేనిఫెస్టో గుర్తుకురాదు. ఎంతసేపు మనీఫెస్టో.ఎన్నికల్లో పెట్టిన ఖర్చుకు వందింతలు వెనకేయాలి. మరో టర్మ్ ఏమోగానీ ఇప్పుడైతే అవకాశం వున్నంతలో సంపాందించాలి. అందరూ కాకపోయినా చాలామంది నేతలు ఇలాగే తయ్యారు. దేశంలో బయటపడుతున్న స్టింగ్ ఆపరేషన్లు చూస్తేనే తెలుస్తుంది. నాటి నుంచి నేటిదాకా ప్రభుత్వాల్ని నడిపిస్తున్నాయి…కూల్చే కుట్రలు చేస్తున్నాయి..కరెన్సీ కట్టలే. ఇప్పుడు రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ ఎపిసోడ్ ఇదే నిరూపిస్తుంది.

ఎవడి సొమ్ము,,?

సంతల్లో సరుకులా కొనేస్తున్నారు. కోట్లకుకోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తున్నారు. సాక్షత్తూ ఇది జనం సొమ్ము. ప్రజల కట్టిన పన్నులు,సెస్సుల పైసలు. స్కీమ్‌లు, స్కామ్‌లు పేరిట స్వాహా చేసినవే. లేదంటే సహజవనరులను చౌకగా వ్యాపారులకు అప్పజెప్పి వారి నుంచి పొందినదే. ఇలా ఎలా వచ్చినా అంతిమంగా అది ప్రజల డబ్బు. భవిష్యత్‌లో జనంపైనే భారం పడేస్తారు.

నాయకుల్లాగే జనం..

వాళ్లు ఇస్తున్నారు.మేం తీసుకుంటున్నాం..మా తప్పేంలేదు. ఇది జనం మాట.వాళ్లు ఇవ్వకపోతే మేం ఎందుకు తీసుకుంటాం. డబ్బులు అందరు తీసుకుంటారని కాదు..ఇక్కడ అడగకున్నా నాయకులే ఇచ్చేస్తున్నారు. కొంతమంది వద్దని వారించినా వినరు. ప్రయాణ ఖర్చలకు అవుతాయని సర్థిచెబుతారు. ఆఖరుకు తీసుకోకపోతే ఇంట్లో పెట్టి వెళ్లిపోతారు. మర్యాదలో తక్కువ చేయరు. మందుబాటిల్స్ పంపిస్తారు..తాగనోళ్లకు కూల్ డ్రింక్‌లు సప్లయ్ చేస్తారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ ఎన్నికైనా ఇంతే.మామూలుగా సర్పంచ్ ఎలక్షన్లకే లక్షల్లో ఖర్చుచేస్తున్నారు. కొన్ని చోట్ల కోట్లు ఖర్చు చేసేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఇంతే. అసెంబ్లీ, లోక్‌సభ ఎలక్షన్లలో భారీగా ఖర్చు చేయాల్సిందే. ఉప ఎన్నిక అయితే చెప్పనవసరం లేదు. వందల కోట్లు కుమ్మరిస్తారు. పరువు,ప్రతిష్ట అంటే ఇంతకు డబుల్ పెట్టేస్తారు.దుబ్బాక నుంచి మునుగోడు దాకా జరుగుతున్నది ఇదే.

నేతల లాజిక్

వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టే మేం ఇస్తున్నాం…లేదంటే మేం ఎందుకు తీసుకుంటామంటారు నాయకులు. కరెన్సీ మేజిక్ కు ప్రతీసారీ ఇదే లాజిక్ చెబుతున్నారు. ఇలా కోట్లు కుమ్మరిస్తారు. నోట్లను ఓట్లకోసం ఇలా చల్లేస్తారు. కోట్లలో పెట్టిన డబ్బుల్ని నేతలు మళ్లీ వెనక్కి తీసుకోవాలి. పదవికిలోకి వచ్చి దిగేదాకా ఇదే ఆలోచన. ఎక్కడ దొరికితే అక్కడ నొక్కేయడానికి చూస్తారు.అంతిమంగా ప్రజల సొమ్మే పక్కదారి పడుతుంది.
లక్షల నుంచి వందల
గతంలో లక్షల్లో బేరసారాలు వుండేవి.ఇప్పుడు కోట్లు,పదికోట్లు..వంద కోట్లకు వచ్చాయి. దేశంలో ఎక్కడో ఓ చోట..రెండు మూడేళ్లకోసారి ఇలాగే జరిగింది. ప్రభుత్వాల్ని కాపాడుకునే సందర్భంలో ఇలాగే జరిగేవి. ఇప్పుడు అలాకాదు పొలిటికల్ ఫిక్సింగ్ లు ఎప్పుడు పడితే అప్పుడు జరుగుతున్నాయి. వందకోట్లతో ఎరవేస్తున్నారు. దక్షిణాదిలో మాత్రం మరి రేటు పలుకుతోంది. ఉత్తరాదిలో లక్షల్లో అమ్ముడుపోయే ఎమ్మెల్యే..దక్షిణాదిలో కోట్లు పలుకుతున్నారు. తెలంగాణలోని మొయినాబాద్ ఫామ్‌హౌజ్ లో జరిగింది ఇదే.

మారాలి అందరూ మారాలి

ముందు నేతలు మారాలి. గెలిపించిన ప్రజలకోసం పనిచేయాలి.భావితరాల కోసం అభివృద్ధి బాటలు వేయాలి. నాయకులే కాదు జనం మైండ్ సెట్ మారాలి. నచ్చిన నాయకుడుకే ఓటేయాలి. నోట్లు ఇస్తే సున్నితంగా తిరస్కరించాలి. అప్పుడే రాజకీయం రాత మారుతుంది. నోట్ల నాట్యం ఆగుతుంది. ఇలా చేస్తే అందరూ కాకపోయినా కొందరైనా మారుతారు. అభివృద్ధి అంతో ఇంతో జరుగుతోంది.