ఇండోనేషియాలో ఇండియన్ స్నాక్స్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇండోనేషియాలో ఇండియన్ స్నాక్స్

November 18, 2022

అవకాశాలు వాటంతటే రావు. వాటికోసం మనం శ్రమ పడాలి. మనమే కొత్త పంథాను వెతికితే కచ్చితంగా విజయం సాధిస్తామని నిరూపించింది మీనా విశ్వనాథ్. ఇండియా నుంచి ఇండోనేషియా వెళ్లింది మీనా. అప్పటిదాకా ఇండియాలో ఉద్యోగం చేసిన అనుభవం ఉంది. కానీ అక్కడికి వెళ్లాక ఏం చేయాలో తోచలేదు. కానీ అలాగే కూర్చుంటే పొద్దుపోలేదు. దానికోసం ఎన్నో ఆలోచనలు చేసింది. దాంట్లో.. ఇండోనేషియాలో ఇండియన్ ఫుడ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నట్లు గమనించింది. అప్పుడు గరిటె పట్టి ఇండియన్ స్నాక్స్ చేయడం మొదలుపెట్టింది. తను ఇప్పుడు అక్కడ కమ్మని వంటలక్కగా పేరు తెచ్చుకుంది. ఆమె ప్రయాణం అసలు ఎలా సాగిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

‘నేను ముంబైలో చదువు పూర్తి చేశాను. అక్కడే ఒక కంపెనీలో చిన్న ఉద్యోగం కూడా చేశాను. 25 సంవత్సరాలకు పెళ్లయింది. దాంతో నా మకాం ఢిల్లీకి మారింది. అక్కడికి వెళ్లాక కుటుంబం పెద్దదయింది. బాధ్యతలు పెరిగాయి. అలా అని ఏదో ఒక ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నా. దాదాపు 18సంవత్సరాల పాటు టీచర్‌గా పనిచేశా. బిజీ కెరీర్‌తో వంట గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. మా అత్తయ్య, తోడికోడళ్లు చూసుకునేవాళ్లు. అలా నేను పెద్దగా వంట ఇంట్లో అడుగుపెట్టలేదు. ఈ మధ్యే మా ఆయనకు ఇండోనేషియాలో ఉద్యోగం వచ్చింది. దాంతో పిల్లలతో సహా మేం ఇండోనేషియా పయనం అయ్యాం. అక్కడికి వెళ్లాక నేను ఏం చేయాలని తెగ ఆలోచించా. ఒక రకంగా చిన్నపాటి రీసెర్చ్ చేశా. ఇండోనేషియాలో భారతీయ ఆహారం పట్ల అందరూ ఎదురుచూస్తున్నట్లు అనిపించింది. అప్పుడే స్నాక్స్‌ని తయారు చేయాలని నిర్ణయించుకున్నా. అసలు నేను వంటలు చేయడమే తక్కువ. అలాంటిది కొత్త వంటకాలు చేయగలనా అనిపించింది. కానీ వెనకడుగు వేయలేదు. కష్టపడి నేర్చుకున్నాను. నా వంటకాలను ఇక్కడ ఉండే ఇండియన్స్‌కి రుచి చూపించాను. వాళ్లకి నచ్చడంతో ఆర్డర్లు మొదలయ్యాయి. కేవలం ఇక్కడ భారతీయులే కాదు.. ఇతరులు కూడా నా వంటకాలను ఇష్టపడుతున్నారు. దానికి నిదర్శనం నాకు వచ్చే ఆర్డర్లే. ఈ నా విజయానికి నా కుటుంబం సపోర్ట్ చాలా ఉంది. వాళ్లే లేకపోతే నేను దీన్ని సాధించలేకపోయేదాన్ని. ఇక నేను ఏ విషయంలోనూ భయపడల్సిన పనిలేదు. వెనుదిరిగి చూడాల్సింది లేదు’ అంటున్నది మీనా విశ్వనాథ్.