పేదలకు సాయం 5 వేలకు పెంచాలి.. పీసీసీ చీఫ్ డిమాండ్
తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని రూ. 5 వేలకు పెంచాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ బి.ఆర్.కె. భవన్‌లో సీఎస్ సోమేష్ కుమార్‌తో అఖిలపక్ష నేతల భేటీ అయ్యారు. సందర్భంగా దొడ్డుబియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయాలని సీఎస్‌ను అఖిలపక్ష నేతలు కోరారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉత్పన్నమౌతున్న సమస్యలను వివరించారు. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, సి.పి.ఐ. రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ, తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు ఇస్తున్న పదిహేను వందల రూపాయలు ఏమాత్రం సరిపోవని నేతలు అభిప్రాయపడ్డారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తరుగు పేరుతో రైతాంగాన్ని మార్కెటింగ్ అధికారులు మోసం చేస్తున్నారని దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు.వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను గుర్తించి రాష్ట్రానికి రప్పించేలా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యపై అనుమానం ఉందని విపక్ష నేతలు పేర్కొన్నారు. ఏపీలో 80 వేలకు పైగా కరోనా వైరస్ పరీక్షలు చేస్తే తెలంగాణలో 20 వేలకు మించి పరీక్షలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పరీక్షలు చేయకపోవడం వల్లే కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా వస్తున్నాయని అభిప్రాయపడ్డారు.