కరోనాతో తాత పోరాటం.. 104వ బర్త్ డే జరుపుకున్నాడు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాతో తాత పోరాటం.. 104వ బర్త్ డే జరుపుకున్నాడు

April 3, 2020

Oregon veteran survives coronavirus, celebrates 104th birthday

వయసు పైబడిన వృద్ధులకు కరోనా సోకితే వారిమీద ఆశలు వదులుకోవాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి కరోనాతో వారి దేహం పోరాడలేదు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో సెంచురీ దాటిన ఓ తాత కరోనాతో చాలా సమర్థవంతంగా యుద్ధం చేశాడు. ఆ ఆనందంతో తన 104వ పుట్టినరోజును జరుపుకున్నాడు. లిబనాన్‌లో నివసిస్తున్న విలియం లాప్‌చీస్‌ మార్చి 10న అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆయన కూతురు కరోలీ బ్రౌన్ ఆసుపత్రిలో చేర్చింది. వైద్యులు ఆ తాతకు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. కోలుకోవడం కష్టం అని భావించిన వైద్యులు విలియం తాతకు చికిత్స ప్రారంభించారు. అయితే తినడానికి ఇంకా ఈ భూమి మీద నూకలు బాకీ ఉన్నాయని అంటారు కదా.. ఈ తాతకు కూడా అలా ఇంకా ఈ భూమి మీద గాలి, ఆహారం, నీరు బాకీ ఉన్నట్టున్నాయి. అందుకే  వైద్యులను ఆశ్చర్యానికి గురిచేస్తూ సదరు తాత కోలుకోసాగాడు. 

Oregon veteran survives coronavirus, celebrates 104th birthday

తన 104వ పుట్టినరోజు కల్లా వ్యాధి నుంచి కోలుకోవడం విశేషం. ఎడ్వార్డ్ అల్వార్త వెటరన్స్ హోమ్‌లో ఉన్న ఆయనను చూసేందుకు కుటుంబ సభ్యులు అందరూ వెళ్లారు. పుట్టినరోజు సందర్భంగా విలియం గది బయట బెలూన్లతో అలంకరించారు. చాక్లెట్ కేకు కోయించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. నర్సింగ్ హోమ్‌లోని ఒక హాల్‌లో ఆయనను కూర్చోబెట్టి సామాజిక దూరం పాటిస్తూ ఈ పుట్టినరోజు నిర్వహించారు. ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వస్తారని వైద్యులు ఈ సందర్భంగా వెల్లడించారు.

కాగా, విలియం తాత రెండో ప్రపంచ యుద్ధంలో బాధితుడు. 1918లో కోట్లాది మందిని బలిగొన్న స్పానిష్ ఫ్లూలా విలయాన్ని కూడా చూశారు. ఇన్నేళ్ల తర్వాత ఆయన మళ్లీ అంతటి విపత్తును చూసి నిలబడటం గమనార్హం.