అనాథల హక్కుల కోసం అందరం పోరాడదాం..! కేంద్ర మంత్రులకు, ఎంపీలకు ఇన్నయ్య వినతి - MicTv.in - Telugu News
mictv telugu

అనాథల హక్కుల కోసం అందరం పోరాడదాం..! కేంద్ర మంత్రులకు, ఎంపీలకు ఇన్నయ్య వినతి

December 8, 2019

innaiah.

మనది పేద దేశం. కోట్లాది పేదలు కనీస అవసరాలు తీరక ఇబ్బందులు పడుతున్నారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు నిత్యం సమస్యలతోనే జీవితాలను ముగిస్తున్నారు. ఇక అనాథల పరిస్థితి చెప్పాల్సిందేముంది? తల్లిదండ్రులు, అయినవారు లేక, ఆదుకునే దిక్కులేక తెగిపోయిన గాలిపటాల్లా బతుకీడుస్తున్న వారిని పట్టించుకునేదెవరు? 

మిగతా పిల్లలతో పోలిస్తే అనాథ పిల్లలు ఎదుర్కొంటున్న కష్టాలను చెప్పడానికి మాటలు చాలవు. తిండి, గూడు, గుడ్డ లేక, నిత్యం అభద్రతతో సాగుతున్న వారి జీవితాల కోసం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తమ వంతు బాధ్యతగా పనిచేయాలి. ఈ దిశగా ఫోర్స్ ఫర్ ఆర్ఫన్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఏమ్పోవేర్మేంట్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, బాల వికాస, డాన్ బోస్కో నవజీవన్ తదితర సంస్థలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. 

అనాథలు ఎదుర్కొంటున్న సమస్యలను  ప్రభుత్వాలకు వివరిస్తూ, ప్రచార కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తున్న ఫోర్స్ సంస్థ వ్యవస్థాపకుడు గాదె ఇన్నయ్య, ఇతర ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి పలువురు నేతలను కలిశారు. ఎంపీలు, మంత్రులను కలసి సమస్యలను వివరించారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలసి వినతి పత్రం అందజేశారు. అనాథల అంశంపై 2020 ఫిబ్రవరి 20 హైదరాబాద్‌లో నిర్వహిచే ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆర్ఫన్స్ ఫండమెంటల్ రైట్స్  సదస్సుకు రావాలని కోరారు. సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్‌ను కూడా కలుసుకున్నారు. FORCE సంస్థ చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు. అనాథల కోసం చట్టాలు తీసుకొచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  

అనాథలు ఎదుర్కొంటున్న సమస్యలు.. 

గాలికి పుట్టి పెరిగారంటూ అనాథలు సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు. సంఘంలో, చట్టాల్లో తమ స్థానం ఎక్కడో తెలియక అత్యంత దయనీయమైన స్థితిలో జీవిస్తున్నారు. చెత్తకుప్పల్లో తింటూ, బ్రడ్జిల కింద, షాపుల మెట్లపై తలదాచుకుంటున్నారు. వేలాది మంది బాలకార్మికులుగా మారిపోతున్నారు. ఇక చదువు అందని ద్రాక్షే. ఎవరి సాయంతోనైనా  చదువుకుందామని స్కూలుకు వెళ్తే నీ పుట్టిన తేది, నీ కులం, నీ ఇంటిపేరు, నీ తల్లిదండ్రుల పేర్లు, నీ చిరునామా ఏమిటి అని ప్రశ్నల వర్షాన్ని ఎదుర్కొంటున్నారు. వాటికి ఏ సమాధానాలు చెప్పాలో తెలియక చదువుకు దూరమవుతున్నారు.

వీరికి బర్త్ సర్టిఫికెట్లు లేదు. 18 ఏళ్లు నిండినా ఓటర్ గుర్తింపు కార్డ్ ఇవ్వడం లేదు. అడ్రస్ ప్రూఫ్ లేదని ఆధార్, రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. రెసిడెన్సీ, క్యాస్ట్, ఇంకమ్ సర్టిఫికెట్లూ లేవు. ప్రభుత్వ స్కాలర్ షిప్ కోసం బ్యాంక్ ఎకౌంట్ ఓపన్ చెయ్యడానికి వెళ్తే అడ్రస్ ప్రూఫ్ లేదని నిరాకరిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే వీరిని భారత పౌరులుగా గుర్తించడంలేదు. ఎలాంటి గుర్తింపు లేకుండా ఈ దేశంలో 4 కోట్ల మంది అనాథలు జీవన పోరాటం సాగిస్తున్నారు. ఏ దాతల సహాయంతోనోకొందరు  మానవతావాదుల సాయంతోనో  చదువుకుందామనే బలమైన ఆ కాంక్షను కూడా ఈ ప్రభుత్వాలు చట్టపరమైన నిబందనల సాకుతో అనాథ బిడ్డలను  విద్యకు దూరం చేస్తున్నాయి. మనం ఈ దుర్మార్గ విధానాన్ని మార్చాలి. ఈ సృష్టిలో ప్రాణం లేని చారిత్రక కట్టడాలకే కాకుండా జంతువులకు, పక్షులకు కూడా హక్కులు ఉన్నాయి. ఎలాంటి హక్కులు లేనిది ఈ దేశంలో అనాధ బిడ్డలకు మాత్రమే కావచ్చు.  కాబట్టి ఈ బిడ్డల వాస్తవ స్థితిని అర్థం చేసుకుని, ఈ ప్రభుత్వాలు, పాలకులు వెంటనే రాజ్యాంగ బద్దమైన హక్కులు కల్పించాలి. వారికి బీమా,  ఆరోగ్య శ్రీ కార్డులు, బస్ పాసులు, ట్రైన్ పాసులు, పెన్షన్ సౌకర్యాలను కల్పించాలి. స్కూళ్లు , కాలేజీల అడ్మిషన్ ఫామ్స్‌లో ఆర్ఫన్  ఆప్షన్‌ను చేర్చాలి.  

అన్ని కులాల వారికి, మతాల వారికి, క్రీడలు, యన్.సి.సి, వికలాంగులు, యన్. ఆర్.ఐ, ఇ.బి.సి. మొదలగు విభాగాలకు చెందిన వారికి ఉద్యోగ నియామకాల్లో, ప్రత్యేక అర్హత కోటాలో అవకాశం కల్పిస్తున్నారు. ఎలాంటి సొంత ఆస్తులు లేని, అనాథగా ముద్రపడిన అనాధ బిడ్డలు మాత్రం ఏ కోటాలోనూ అవకాశం కల్పించుటలేదు. అనాథ బాలబాలికలను గుర్తించి వారికి ఆర్ఫన్ సర్టిఫికేటును  జారీచేయాలి. ప్రభుత్వమే మార్జిన్ మనీ కట్టి వారికి సెల్ఫ్ ఎంప్లాయ్ మేంట్ స్కీము ద్వారా బ్యాంకు రుణాలు ఇవ్వాలి. అనాథ బాల బాలికల వారి ప్రతిభా పాటవాల  ఆధారంగా ఉన్నత చదువులకు అయ్యే మొత్తం ఖర్చులను ప్రభుత్వమే భరించాలి. అనాధల సమస్యలను వెంటనే పరిష్కరించుటకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిదిలోనే ప్రత్యేకమైన అధికారులను నియమించి సత్వరమే  సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ప్రాధమిక విద్యాబ్యాసం నుండి ఉన్నత చదువులు పూర్తయ్యే వరకు పుస్తకాలుబట్టలు ఇంకా అవసరమైన  ప్రాదాన్యత కలిగిన వాటి కనీస  కర్చులను కూడా ప్రభుత్వమే అందించాలి.  డ్వాక్రా గ్రూపు సభ్యుల పిల్లలకు సంవత్సరానికి ఇస్తున్న రూ.1200 /- ఉపకారవేతనాన్ని అనాథ బిడ్డలకు కూడా ప్రభుత్వం ఇవ్వాలి. మొత్తంగా ఈ సమాజం, ప్రభుత్వాలు, నాయకులు, ప్రజలకు అనాథల బాగోగులకు బాధ్యత వహించాలి.