Osara said they killed me: Jadeja
mictv telugu

ఓసారైతే నన్ను చంపేశారని చెప్పారు: జడేజా

August 31, 2022

టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సంచలన విషయాలను వెల్లడించారు. తన కెరీర్‌ పరంగా ఇప్పటివరకు జరిగిన సంఘటనలు, తనపై వచ్చిన వదంతులపై తాజాగా మీడియా ముందు వెల్లడించాడు. ”నాపై ఇటీవల ఎన్నో వదంతులు వచ్చాయి. నాకు చైన్నైతో విభేదాలు వచ్చాయని, నన్ను టీ20 ప్రపంచకప్ నుంచి తప్పించారని రాశారు. అంతెందుకు, ఒకసారి రవీంద్ర జడేజా చచ్చిపోయాడు అని కూడా రాశారు. ఇంకొసారైతే జడేజాను ఎవరో చంపేశారని కూడా రాశారు. దీనికంటే పెద్ద వదంతేమైనా ఉంటుందా? ఇలాంటి వాటిని నేను పట్టించుకోను. కేవలం మైదానం, ఆట మీదే దృష్టి పెడతా. ఈ దేశం కోసం ఎలా ఆడాలన్నదే నా లక్ష్యం. జట్టు కోసం నేనేం మెరుగుపర్చుకోవాలో చూసుకుంటా” అని ఆయన అన్నారు.

ఇటీవలే జడేజాకు ఛాతి కండరాల గాయం కావడంతో ఈ ఏడాది టీ20 మెగా టోర్నీ మధ్యలోనే వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సోషల్ మీడియాలో సౌరాష్ట్ర మాజీ క్రికెటర్ రవీంద్ర జడేజా మృతిచెందాడు. ఆయనను ఎవరో చంపేశారు అని జడ్డూపై పలు రకాల వదంతుల ప్రచారం జరిగాయి. దాంతో జడ్డూ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలో ఆ సంఘటలను గుర్తుచేసుకొని, జడేజా తాజాగా స్పందిస్తూ, పై వ్యాఖ్యలు చేశారు.

ఇక, ఈ ఏడాది టీ20 మెగా టోర్నీ విషయానికొస్తే.. చెన్నై జట్టుకు కెప్టెన్ బాధ్యతల నుంచి ధోనీ ముందే తప్పుకొన్నాడు. దీంతో జట్టు బాధ్యతలను జడేజాకు అప్పగించారు. అయితే, జడ్డూ సారథ్యంలో చెన్నై వరుస ఓటములు చవిచూసింది. అటు ఆల్ రౌండర్ గానూ రాణించలేకపోయాడు. దీంతో జట్టు బాధ్యతలను తిరిగి ధోనీకే అప్పగించారు. ఆ తర్వాత చెన్నైతో జడేజాకు విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. ఇటీవల జడ్డూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెన్నై జట్టుకు సంబంధించిన అన్ని పోస్టులను తొలగించడం కూడా ఈ ఊహాగానాలను మరింత బలపర్చింది. కానీ, అవన్నీ ఊహాగానాలు అనే విషయాన్ని జడేజా స్పష్టతనిచ్చాడు.