సేల్స్ మేన్ కి ఆస్కార్ వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్న... - MicTv.in - Telugu News
mictv telugu

సేల్స్ మేన్ కి ఆస్కార్ వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్న…

June 16, 2017

భవనం ఎంత బలమైనదైనా కావొచ్చు. చిన్నపగులు మనల్ని భయపెడుతుంది. అందులో ఉండడమంటే భయం పుట్టిస్తుంది. ఏదైనా అనుబంధం కూడా అంతే. అది బలమైనదే కావొచ్చు. మేల్ ప్రివిలేజ్ అనే పగులు దాని అతిపెద్ద బలహీనత. ఇంకా చాలా బలహీనతలున్నా ఇది చేసే విధ్వంసమే ఎక్కువ. గాయం తగిలాక అది మానిపోవచ్చు. కానీ మచ్చ ఎక్కడో ఓచోట మిగిలిపోతుంది.

త్రిపుర కథ. ఫర్హాదీ సినిమా. అవి నాకు అర్ధం అయినా, కాకపోయినా అద్భుతాలే. ఏవేవో గుర్తు చేస్తుంటాయి. వాటిని చదివేటప్పుడు, చూసేటప్పుడు.. జీవితంలోని ఏదో మూలకి టార్చ్ లైట్ వేసి చూపించినట్టు అనిపిస్తుంది.

సేల్స్ మేన్ కి ఆస్కార్ వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికి సబ్ టైటిల్స్ తో ఉన్న లింక్ దొరికింది.
సినిమాలో ఓ సీన్ లో హీరో ఎమాద్.. స్కూల్ నుంచి వెళ్తూ మరో స్టూడెంట్ తో కల్సి ట్యాక్సీ ఎక్కుతాడు. అప్పటికే అందులో ఉన్న ఒకామె హీరోని ముందు సీట్లోకి మార్చాలంటూ డ్రైవర్ తో గొడవ చేస్తుంది. హీరో కామ్గా సీటు మారతాడు. తర్వాత క్లాస్ లో స్టూడెంట్ అడుగుతాడు.. ఆమె అలా అన్నందుకు మీరు బాధ పడ్డారు కదా అని. అందులో బాధ పడ్డానికి ఏముంది.. అంతకుముందు ఉన్న వాడెవడో ఆమెని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. అందుకే ఆమె నన్ను సీటు మార్పించాలని కోరి ఉండొచ్చు కదా అంటాడు హీరో.

సినిమా మొదట్లో సీన్. బిల్డింగ్ కూలిపోయే ప్రమాదముందని అంతా భయంతో ఖాళీ చేస్తుంటారు. అంత హడావుడిలో కూడా హీరో.. పక్కింట్లో నడవలేని పరిస్థితిల్లో ఉన్న ఓ వ్యక్తిని మోసుకుని తీసుకెళ్తాడు.

ఈ రెండు సీన్లలో హీరో మనస్తత్వం, తనెలాంటివాడో అర్ధమైపోతుంది. కానీ తన భార్యపై ఎవడో గుర్తుతెలియని వ్యక్తి ఎటాక్ చేశాడని తెలిశాక.. హీరో ఎందుకు వాడ్ని వేటాడాలనుకుంటాడు. వాళ్లు అద్దెకి మారిన ఇంట్లో ముందున్న ఆమెపై రివేంజ్ తీసుకోడానికి వచ్చిన వ్యక్తే కదా అని.. ఎందుకు దాన్ని లైట్ తీసుకోలేడు..? అసలు పోలీస్ కంప్లయింట్ ఇవ్వకుండా తనే ఎందుకు పోలీసులా మారతాడు..? ఈ ప్రశ్నలకి సమాధానం దొరికేకొద్దీ సేల్స్ మేన్ మామాలు థ్రిల్లర్ సినిమాల కంటే ఏదో ఎక్కువగా అనిపిస్తుంది.

సినిమాని మామూలు థ్రిల్లర్ డ్రామాగా చూసినా అద్భుతమే అనిపిస్తుంది. కానీ ఆర్ధర్ మిల్లర్-డెత్ ఆఫ్ ఏ సేల్స్ మేన్ గురించి తెలిసుంటే ఫర్హాదీ సేల్స్ మేన్ ని ఇంకా ఏంజాయ్ చేయొచ్చు.

– రవి బడుగు