మరికొన్ని గంటల్లో ‘ఆస్కార్స్ 2023’ అంగరంగ వైభవంగా జరిగేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం 95వ ఆస్కార్ వేడుకలు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బి థియేటర్‌లో గ్రాండ్‌గా జరుగునున్నాయి. ఎప్పుడూ లేనంత ఉత్కంఠతో తెలుగు ప్రేక్షకులు ఈ వేడుక కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్ నుంచి నాటు నాటు పాట ఫైనల్ నామినేషన్‌లో చోటుదక్కించుకుంది. ఇక ఇదిలా ఉంటే అసలు ఆస్కార్ అవార్డుకు ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎప్పుడు మొదలైంది? ఎక్కడెక్కడ జరిగింది? లాంటి ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం.
ఫస్ట్ సెలబ్రేషన్ అక్కడే..
మొట్టమొదటి ఆస్కార్ వేడుక మే 16, 1929 లో జరిగిందిద. ప్రఖ్యాత హాలీవుడ్ రూజ్‌వెల్ట్ హోటల్‌లో 270 మంది అతిథుల సమక్షంలో అవార్డులు ప్రదానం చేశారు. దర్శకులు, సాంకేతిక నిపుణులకు మొత్తం 15 అవార్డులను అందజేశారు. ఆ వేడుక 15 నిమిషాల్లోనే ముగిసిపోవడం విశేషం.
తొలి ఆస్కార్ విన్నంగ్ నటీనటులు వీరే..
తొలిసారి ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును అందుకున్న నటుడు ఎమిల్ జెన్నింగ్స్. ‘ది లాస్ట్ కమాండ్’ చిత్రానికి ఈయన ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. అదేవిధంగా తొలిసారిగా ఉత్తమ నటి అవార్డును ‘సెవెన్త్ హెవెన్’ సినిమాలో నటనకు గాను జనేట్ గేనోర్ అందుకున్నారు.
2002 నుంచి ఒకే వేదికపైన..
తొలిసారిగా లాస్ ఏంజిలెస్‌లో హాలీవుడ్ రూజ్‌వెల్ట్ హోటల్ జరిగిన ఈ వేడుక.. ఆ తర్వాత పలు హోటల్స్,ఆడిటోరియమ్ లలో జరిగాయి. అంబాసిడర్ హోటల్, ష్రైన్ ఆడిటోరియమ్.. ఇలా ఎప్పటికప్పుడు వేదిక మారుతూ వచ్చింది. 1961లో తొలిసారి వేదికను కాలిఫోర్నియాకు మార్చారు. మళ్లీ 1969లో తిరిగి లాస్ ఎంజిలెస్‌కు తీసుకొచ్చారు. 1990ల నుంచి 2001 వరకు ష్రైన్ ఆడిటోరియమ్‌లోనే వేడుకలు జరగగా 2002 నుంచి ఇప్పుడు లాస్ ఎంజిలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో చేయడం మొదలెట్టారు. అప్పటి నుంచి ఈ ఏడాది వరకూ ఈ పసిడి పండగ అక్కడే అట్టహాసంగా జరుగుతోంది.
ఈసారి ప్రత్యేకం..
ప్రతి ఏడాది నటీ నటులకు రెడ్ కార్పెట్ మీద స్వాగతం పలుకుతుంది అకాడమీ . కానీ ఈ ఏడాది తన 62 ఏళ్ళ ట్రెడిషన్‌ని బ్రేక్ చేస్తూ.. అతిథులు కోసం రెడ్ బదులు షాంపైన్ కార్పెట్ పరుస్తుంది. రెడ్ కార్పెట్ మీదుగా ఈ షాంపైన్ కార్పెట్‌ను వేస్తున్నారు. 1961 తర్వాత మొదటిసారిగా కార్పెట్ ఎరుపు రంగులో కాకుండా షాంపైన్ రంగులో ఉండనుంది. వివిధ భాషల నుంచి దాదాపు 300 చిత్రాలు ఆస్కార్ పురస్కారాల కోసం షార్ట్‌లిస్ట్ కాగా.. అత్యుత్తమ ప్రమాణాలను కలిగిన చిత్రాల్ని ఓటింగ్ ద్వారా అకాడమీ తుది జాబితాను ఎంపిక చేసింది.