ఎంతో ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా భవనం ఆస్పత్రికి పనికిరాదని హైకోర్టుకు నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. ఆస్పత్రిగా వాడాలంటే మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుందని తెలిపింది. ఆక్సిజన్, మంచినీరు, సివరేజీ, గ్యాస్ పైప్లైన్లు వేయాల్సి ఉంటుందని సూచించింది. ఆస్పత్రికి ఉపయోగపడేలా మరమ్మతులు చేస్తే భవనం దెబ్బతింటుందని కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. ఈమేరకు నిపుణుల కమిటీ నివేదికను అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు సమర్పించారు. నిపుణుల కమిటీ నివేదికపై ప్రభుత్వ నిర్ణయం చెప్పేందుకు కొంత గడువు కావాలని ఏజీ కోర్టును కోరారు. నివేదికపై పిటిషనర్లు అధ్యయనం చేశాక విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది.