లాక్‌డౌన్ సడలింపులతో కరోనా కేసుల భారీగా పెరుగుతున్నాయి. సంపూర్ణ లాక్¡డౌన్ కాలంలో రోజుకు పది, ఇరవై కేసులు మాత్రమే నమోదైన తెలంగాణలో ప్రస్తుతం రోజుకు వందలెక్కన నమోదవుతున్నాయి. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్న వైద్యులను కూడా వైరస్ వదలడం లేదు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఏకంగా ఏడుగురు జూనియర్ డాక్టర్లకు కరోనా సోకింది. వారి పరిస్థితే అలా ఉంటే ఇక ఆస్పత్రికొచ్చే సామాన్యుల పరిస్థితి ఏంటో చెప్పాల్సిన పనిలేదు.
కరోనా సోకిన డాక్టర్లలో ఇద్దరు యువతులు కూడా ఉన్నారు. అయితే వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కాలేజీ ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు. ముందుజాగ్రత్తగా పీజీ మెడికోలందరికీ జూనియర్ టెస్టులు చేయిస్తున్నామని చెప్పారు. ‘కరోనా సోకిన డాక్టర్లను గాంధీ ఆస్పత్రికి తరలించాం. ఉస్మానియా కాలేజీలో క్లాస్ రూమ్స్, ల్యాబ్‌లను శానిటైజ్ చేస్తున్నాం. జూనియర్ డాక్టర్లకు జూన్ 20 నుంచి పరీక్షలు ఉండడంతో అందరూ హోంక్వారంటైన్ వెళ్లాలని చెప్పాం…’ అని ఆమె తెలిపారు. తెలంగాణలో సోమవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 2792కి చేరింది. కొత్తగా నమోదైన 94 కేసుల్లో 79 జీహెచ్ఎంసీ పరిధిలోనివే. రాష్ట్రంలో ఇంతవరకు కరోనాతో 82 మంది చనిపోయారు.