దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఒక్కటైన ఉస్మానియా యూనివర్సిటీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. త్వరలో టీవీ ఛానల్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. డీటీహెచ్‌లో ఉచితంగా ఈ ఛానల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. శాటిలైట్ లింక్‌లు, ఛానల్ నంబరు ప్రసారాలపై వర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ కొత్త ఛానల్‌ను ‘ఉస్మానియా యూనివ్’ పేరిట అందుబాటులోకి తేనుంది.
దీని ద్వారా విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, ఉద్యోగ, విద్య సమాచారం, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలను టీవీ ఛానల్లో ప్రసారం చేయవచ్చని వీసీ రవీందర్ తెలిపారు. కాగా దేశంలో ఒక యూనివర్సిటీకి టీవీ ఛానల్ అనేది ఎక్కడా లేదు. తొలిసారిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ ప్రయోగానికి తెరలేపింది. రవీందర్ నేతృత్వంలో యూనివర్శిటీలో కొత్తగా వివిధ డైరెక్టరేట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డైరెక్టరేట్ అందుబాటులోకి వచ్చింది. త్వరలో డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఏర్పాటు కానుంది.