గత నాలుగు నెలలుగా చర్లపల్లి జైలులో ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాశీమ్ ఎట్టకేలకు బెయిల్ పై ఈరోజు విడుదలయ్యారు. రూ.లక్ష జరిమానా, రెండు షూరిటీలతో పాటు, దర్యాప్తునకు సహకరించాలని కోర్టు షరతులు విధించింది.
నాలుగు నెలల క్రితం ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాశీంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇంట్లో యూనివర్సిటీలోని క్వార్టర్స్‌లోనూ సోదాలు నిర్వహించారు. తర్వాత అరెస్ట్ చేసి గజ్వేల్‌కు తరలించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కారణంతోనే ఈ సోదాలు చేపట్టారు. కాగా, 2016లో నమోదైన ఓ కేసులో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నారని పోలీసులు అంటున్నారు. ములుగులో ఓసారి ఆయన కారులో విప్లవ సాహిత్యం దొరికినట్టుగా కేసు నమోదు చేశారు. దీంతో ఆయన మావోయిస్టుకు సానుభూతిపరుడిగా ఉన్నారని కాశీంను ఏ-2గా చేర్చారు. కాశీం విప్లవం రచయితల సంఘం(విరసం) రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కొన్ని రోజులకే పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.