Our country is bankrupt: Pakistan Defense Minister Khawaja Asif
mictv telugu

మా దేశం దివాళా తీసింది : పాక్ రక్షణ మంత్రి సంచలన వీడియో

February 19, 2023

Our country is bankrupt: Pakistan Defense Minister Khawaja Asif

ఆర్ధిక, ఆహార సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్ గురించి ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మన దేశం దివాళా తీసిందని, దివాళా తీసిన దేశంలో బతుకుతున్నామని అ(న)ధికారికంగా చెప్పేశారు. ఇటీవల సియాల్‌కోట్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో జరిగిన కాన్వొకేషన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పాకిస్తాన్ విదేశీ అప్పులు చెల్లించలేకపోతోందని, ఆర్ధిక సంక్షోభంలో ఉందనే వార్తలు మీరు వినే ఉంటారు. అది ఇప్పటికే జరిగిపోయింది. మనం దివాళా తీశాం. ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది మన కాళ్లపై మనం నిలబడడమే. ఈ సమస్యకు ఐఎంఎఫ్ సహాయం పరిష్కారం కాదు. అసలు పరిష్కారం మన దేశంలోనే ఉంది’ అంటూ తమ దేశ దుస్థితిని సూటిగా స్పష్టం చేశారు. అయితే దీనికి కారణం ఇమ్రాన్ సారథ్యంలోని పీటీఐ ప్రభుత్వం గతంలో అనుసరించిన విధానాలే అని ఆరోపించారు.

 

‘ఇమ్రాన్ ఆడిన ప్రమాదకరమైన ఆట వల్ల దేశంలో ఉగ్రవాదం తిరిగి పుంజుకుంది. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి తిరిగి తీసుకొచ్చారు. ఉగ్రవాదాన్ని దేశ గమ్యస్థానంగా మార్చారు’ అంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై పీటీఐ ప్రతిస్పందించింది. షెహబాజ్ షరీఫ్ అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలోనే దేశాన్ని దివాళా తీయించారని ప్రత్యారోపణ చేసింది. కాగా, 2019లో ఐఎంఎఫ్ 6 బిలియన్ డాలర్ల సాయం అందించగా, 2022లో వరదల కారణంగా మరో 1.1 బిలియన్ డాలర్లను ప్రకటించింది. అయితే గందరగోళ రాజకీయ పరిస్థితుల మధ్య ఆర్ధికంగా చితికిపోయిన పాకిస్తాన్ అన్ని రకాలుగా పురోగతి సాధించడంలో విఫలమయి, వాయిదాలు కట్టకపోవడంతో నవంబరులో చెల్లింపులను నిలిపివేసింది.