జార్జిరెడ్డి పాత్రే మా హీరో.. నిర్మాత అప్పిరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

జార్జిరెడ్డి పాత్రే మా హీరో.. నిర్మాత అప్పిరెడ్డి

November 21, 2019

Our hero is the role of George Reddy.. Producer Appi Reddy

‘జార్జిరెడ్డి కథ నేటి తరానికి స్ఫూర్తిని ఇచ్చేలా ఉంటుంది. ఈ కథకు స్టార్‌ హీరోలు అవసరం లేదు. జార్జిరెడ్డి పాత్రే మా హీరో’ అని జార్జిరెడ్డి చిత్ర నిర్మాత అన్నపురెడ్డి అప్పిరెడ్డి అన్నారు. ‘దళం’ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘వంగవీటి’ ఫేం సందీప్ మాధవ్ టైటిల్ రోల్ పోషించారు. సిల్లీమోంక్స్, త్రీలైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి మైక్ మూవీస్ అదినేత అన్నపురెడ్డి అప్పిరెడ్డి, దామోదర్ రెడ్డి, సంజయ్ రెడ్డి నిర్మించారు. వివాదాలు చుట్టుముట్టుకున్న ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. 

ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘అమెరికాలో ఉన్నప్పుడే ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాలి అనుకున్నాను. ఇక్కడ మా ‘మైక్‌ టీవీ’కి బ్రాండింగ్‌ ఉండటంతో మైక్‌ మూవీస్‌ అనే బ్యానర్‌ను స్థాపించాను. ఈ బ్యానర్‌పై మంచి సినిమాలు చేయాలనుకున్నాను. ఈ క్రమంలో దర్శకుడు జీవన్ రెడ్డి నాకు జార్జిరెడ్డి కథ వినిపించారు. కథ విన్నాక నాకు ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. సబ్జెక్ట్‌ నచ్చడంతో బడ్జెట్‌ గురించి ఆలోచించలేదు. అప్పటి ఉస్మానియా యూనివర్సిటీ సెట్‌ను వేశాం. చిరంజీవిగారు మా సినిమా చూస్తాను అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు. 

మరో నిర్మాత దామురెడ్డి కొసనం మాట్లాడుతూ.. ‘జార్జిరెడ్డిలో హీరోకు ఉన్న లక్షణాలు ఉన్నాయి. ఆయన ఒక బాక్సర్, ఫైటర్‌. ఓ సందర్భంలో జార్జిరెడ్డిపై ఓ డాక్యుమెంటరీ తీశాం. అప్పుడే సినిమా చేద్దామనే ఆలోచన కలిగింది. ఈ సినిమా కోసం దర్శకుడు జీవన్ రెడ్డి ఎంతగానో కష్టపడ్డారు. జార్జిరెడ్డి క్యారెక్టర్‌ను హైలైట్‌ చేయాలని మరొకరిని కించపరచలేదు. ప్రమోషన్స్, బిజినెస్, పబ్లిసిటీ మాకు కొత్త. సంజీవ్‌రెడ్డిగారు మాతో కలవడం ప్లస్‌ అయింది’ అని అన్నారు. ‘కొత్త కథలను తెలుగు ఇండస్ట్రీ ప్రోత్సహిస్తుంది. చిరంజీవి, పవన్‌ కల్యాణ్, నాగబాబుగార్లు మా సినిమాకు మోరల్‌ సపోర్ట్‌గా నిలిచారు. మంచి సినిమా నిర్మించామనే సంతృప్తి చాలా ఉంది’ అని సిల్లీమోంక్స్ అధినేత సంజయ్‌రెడ్డి అన్నారు.