మా కొడుక్కి పిచ్చి.. తహశీల్దార్ కేసు నిందితుడి తల్లిదండ్రులు - MicTv.in - Telugu News
mictv telugu

మా కొడుక్కి పిచ్చి.. తహశీల్దార్ కేసు నిందితుడి తల్లిదండ్రులు

November 4, 2019

Tahasildar...

తెలంగాణలో సంచలనం సృష్టించిన తహశీల్దార్ విజయారెడ్డి దారుణహత్యపై నిందితుడు సురేష్ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. తన కొడుక్కి మతిస్థిమితం లేదని సురేష్‌ తండ్రి కృష్ణ అన్నారు. తహసీల్దార్‌ ఆఫీసుకు ఎందుకు వెళ్లాడో కూడా తెలియదని తెలిపారు. తమకు ఉన్న భూమిపై హైకోర్టులో కేసు నడుస్తోందని చెప్పారు. భూమి వ్యవహారం సురేష్‌కు ఏమీ తెలియదని పేర్కొన్నారు. ఎవరో కావాలని తమ కొడుకుతో ఈ పని చేయించారని సురేష్‌ తల్లి పద్మ అనుమానం వ్యక్తం చేశారు.

రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహశీల్దార్ విజయారెడ్డి డ్యూటీలో ఉన్న సమయంలో నిందితుడు సురేష్ ఆమె చాంబర్‌లోకి వెళ్లాడు. అరగంట వరకు మాట్లాడాడు. అనంతరం ఇద్దరిమధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నిందితుడు తలుపులు మూసేసి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఆమెపై పోసి నిప్పంటించాడు. దీంతో ఘటన స్థలంలోనే ఆమె పూర్తిగా కాలిపోయి మరణించారు. వెంటనే మిగిలిన పెట్రోల్ తనపై పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. ఎమ్మార్వోను కాపాడబోయిన ఇద్దరు సిబ్బంది కూడా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. 

కాగా, ఈ దారుణంపై రెవెన్యూ సంఘాలు నిరసనలు చేపట్టనున్నారు. రేపు రాష్ట్ర బంద్‌కు రెవెన్యూ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో రేపు రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించనున్నారు. అలాగే విజయారెడ్డి అంతిమయాత్రలో రెవెన్యూ ఉద్యోగులు పాల్గొననున్నారు.