పందిని 70 అడుగుల పైకి తీసుకెళ్లి.. వికృతం - MicTv.in - Telugu News
mictv telugu

పందిని 70 అడుగుల పైకి తీసుకెళ్లి.. వికృతం

January 20, 2020

Pig

నోరులేని జీవాలను చంపుకుని తింటున్నాం. వాటి రక్తమాంసాలే కాదు పాలతోనూ వ్యాపారాలు చేసుకుంటున్నాం. అదే రాక్షసత్వం అనుకుంటే పైనుంచి వాటిని హింసించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించండి. పాపం వీళ్లు ఓ పందితో ఎంత పైశాచికంగా బంగీ జంప్ చేయిస్తున్నారో. వారి వికృత చేష్టను చూసి సోషల్ మీడియాలో చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోరులేని జీవితో ఇంతటి పైశాచిక ఆనందం పొందడం మనుషుల స్వభావం కాదు రాక్షసుల స్వభావం అని తిట్టి పోస్తున్నారు. చైనాలోని చాంగ్‌కింగ్ ప్రాంతంలో ఇటీవల ఓ థీమ్ పార్క్ ప్రారంభమైంది. ఈ థీమ్ పార్క్‌లో ప్రత్యేకంగా బంగీ జంప్‌ను సైతం ఏర్పాటుచేశారు. అయితే మొదటి బంగీ జంప్‌ను మనుషులతో చేయకుండా పందితో చేయించాలనే విపరీత ఆలోచన పుట్టింది వారికి. 

అంతే పందిని కట్టేసి 70 మీటర్ల(230 అడుగుల) ఎత్తు నుంచి కిందకు వదిలారు. భయబ్రాంతులకు గురైన పంది బిగ్గరగా అరిచింది. దాని అరుపులు వింటూ అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొడుతున్నారు. జనవరి 18న ఈ సంఘటన చోటుచేసుకోగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోరులేని మూగజీవులతో ఇంత దారుణంగా హింసించడానికి మీకు మనసు ఎలా ఒప్పింది? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై పార్క్ యాజమాన్యం స్పందించింది. ఇటీవల చైనాలో ‘పిగ్ ఆఫ్ ది ఇయర్’ పూర్తైన సందర్భంగా ఇలా చేశామని పార్క్ వివరణ ఇచ్చారు. అయితే మాత్రం ఇలా చేస్తారా? అని నెటిజన్లు మళ్లీ మళ్లీ విరుచుకుపడుతున్నారు.