కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు పేదలకు ఉచితంగా రేషన్ అందించాలని శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్ణయించింది. కోవిడ్ సమయంలో ప్రారంభించిన పథకాన్ని డిసెంబర్ 2023 వరకు జాతీయ ఆహార భద్రతా చట్టంతో విలీనం చేసేందుకు ఆమోదం తెలిపింది.
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశంలోని 81.35 కోట్ల పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించనున్నట్లు కేంద్ర ఆహార మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఇప్పటి వరకు జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ) ప్రకారం తక్కువ ధరల్లో, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా బియ్యం, గోధములు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆరెండు పథకాలను విలీనం చేయనుంది. అంత్యోదయ అన్నయోజక కిందికి వచ్చే కుటుంబాలకు నెలకు 35 కిలోల చొప్పున, మిగత వారికి నెలకు తలసరి 5 కిలోల చొప్పున ఉచితంగా రేషన్ ఇవ్వనున్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద పంపిణీ చేసే బియ్యం, గోధుములు, చిరుధాన్యాలపై ప్రస్తుతం రూ.3, రూ.2, రూ.1 డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ మొత్తాలను వసూలు చేయకుండా ఆహారధాన్యాలను ఉచితంగా అందించనుంది కేంద్ర సర్కార్. దీనివల్ల పడే రూ.2 లక్షల కోట్ల ఆహార సబ్సిడీ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. 2023 డిసెంబర్ వరకు ఈ పథకం అమలులో ఉంటుంది.