కరోనా మహమ్మారి కారణంగా చాలా కంపెనీలు ముఖ్యంగా సాఫ్ట్వేర్ మరియు ఇతర రంగాల్లోని కార్యాలయాలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించాయి. అప్పటి నుంచి అంటే దాదాపు రెండేళ్ల నుంచి ఉద్యోగులు ఇంటి వద్దనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కేంద్ర ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను చాలావరకు ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రమ్మంటున్నాయి. ఇప్పటికే చాలామంది ఉద్యోగులు ఆఫీసులకు వస్తున్నారు కూడా. అయితే రావాలని కోరినందుకు ఓ కంపెనీకి చెందిన 800 అది నచ్చక రాజీనామా చేశారు.
ముంబైకి చెందిన కోడింగ్ లెర్నింగ్ స్టార్టప్ కంపెనీ ‘వైట్‌హ్యాట్ జేఆర్’ కు చెందిన 800 మంది ఉద్యోగులు ఆఫీసుకు రమ్మనందుకు రాజీనామా చేసినట్లు తెలిసింది. ఎన్సీ 42 అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఆఫీసుకు వచ్చి పనిచేయడం ఇష్టంలేకే వాళ్లంతా స్వచ్ఛందంగా రాజీనామాలు సమర్పించినట్టు నివేదిక పేర్కొంది. ఇక ఆఫీసులకు వచ్చేయాలంటూ ఈ ఏడాది మార్చి 18న ముంబై, బెంగళూరు, గురుగ్రామ్ లోని ఉద్యోగులందరికీ సంస్థ ఆదేశాలిచ్చిందని, ఆ ఆదేశాలు నచ్చక ఉద్యోగులంతా మూకుమ్మడి రాజీనామాలు చేశారని తెలిపింది. రాజీనామాలు చేసిన వారిలో సేల్స్, కోడింగ్, గణితం వంటి రంగాల్లో నిపుణులైన ఉద్యోగులు ఉన్నారు.