జనాభా విషయంలో భారత్ 2023 నాటికి చైనాను దాటేస్తుందని ఇటీవల ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో వెల్లడించింది. దీని వల్ల భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు కొంత మెరుగుపడే అవకాశాలున్నాయని ఆ సంస్థ అధికారి అభిప్రాయపడ్డారు. ఇది పోతే జనాభా పెరుగుదలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఇటీవల కామెంట్ చేశారు. దేశంలో జనాభా పెరుగుదలను అరికట్టాలని, కానీ, దానిలో అసమతౌల్యత ఉండకూడదని వ్యాఖ్యానించారు. దీంతో ఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీ కౌంటరిచ్చారు. ‘జనాభా అంశం వచ్చిన ప్రతీసారి ముస్లింలను టార్గెట్ చేస్తున్నారు. ఏం? ముస్లింలు ఈ దేశ మూలవాసులు కాదా? ఆ విషయానికి వస్తే అసలైన మూలవాసులు ద్రవిడులు, గిరిజనులే. జనాభా నియంత్రణ ఎలాంటి ప్రత్యేక చట్టం అవసరం లేదని మీ పార్టీకే చెందిన కేంద్ర ఆరోగ్యమంత్రి చెప్పిన మాట మరిచారా? దేశ సంతానోత్పత్తి రేటు 2016తో పోలిస్తే 2.6 నుంచి 2.3 కి తగ్గింది. అలాగే జనాభా నియంత్రణ కోసం గర్భనిరోధక సాధనాలు ముస్లింలే ఎక్కువగా వాడుతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారత్లోనే జనాభా సమతౌల్యత మెరుగ్గా ఉంద’ని వెల్లడించారు.