మేమేం పిల్లలం కాదు.. మోహన్ భగవత్‌కు ఒవైసీ కౌంటర్ - MicTv.in - Telugu News
mictv telugu

మేమేం పిల్లలం కాదు.. మోహన్ భగవత్‌కు ఒవైసీ కౌంటర్

October 25, 2020

మేమేం

అబద్ధాలు అవాస్తవాలతో తప్పుదారి పట్టించడానికి తాము చిన్నపిల్లలం కాదని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టంపై (సీఏఏ)పై ముస్లిం సోదరులను కొంత మంది తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలకు అసద్ కౌంటర్ ఇచ్చారు. ‘మేమేం చిన్నపిల్లలం కాదు, మమ్మల్ని తప్పుదారి పట్టించడానికి. సీఏఏ+ఎన్ఆర్‌సీ విషయంలో బీజేపీ నీళ్లు నమలింది. ఒకవేళ ఆ చట్టం ముస్లింలకు సంబంధించింది కాకపోయి ఉంటే ఆ చట్టంలో మతానికి సంబంధించిన విషయాలను తొలగించండి. మేము భారతీయులమని నిరూపించే చట్టాలు వచ్చేంత వరకు మళ్లీ మళ్లీ నిరసనలు చేస్తూనే ఉంటాం’ అని అసద్ ట్వీట్ చేశారు. 

కాగా, దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ సీఏఏపై వ్యాఖ్యానించారు. సీఏఏ వల్ల ముస్లింల జనాభా తగ్గుతుందనే ఆలోచనతో వారిని తప్పుదోవ పట్టించారని అన్నారు. సున్నితమైన అంశాన్ని ఆసరాగా తీసుకుని అవకాశవాదులు దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. నిరసన పేరిట వ్యవస్థీకృత హింసను ప్రేరేపించడం ద్వారా.. సామాజిక అశాంతి చోటుచేసుకుంటుందని వివరించారు. పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాల్సి ఉందని.. కానీ కరోనా వైరస్ రెచ్చిపోవడంతో ఆ ప్రయత్నాలు నిలిచిపోయాయని వెల్లడించారు. సీఏఏ ప్రత్యేకంగా ఏ మతానికి వ్యతిరేకం కాదని.. ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారని మండిపడ్డారు. ఈ చట్టం ముస్లిం జనాభాను నియంత్రించే చట్టమని తప్పుడు ప్రచారాలతో ముస్లిం సోదరులను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని తెలిపారు. దీని ఆధారంగా మరిన్ని నిరసనలు జరగొచ్చు అని చెప్పారు.