మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా సంకల్ప్ సభలో పాల్గొన్న ఆయన.. ఆ రాష్ట్రంలో ఇటీవల ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఔరంగజేబు సమాధికి నివాళి అర్పించడం గురించి ప్రస్తావించారు. ఔరంగజేబు ఆనవాళ్లపై కుక్క కూడా మూత్రం పోయదని అన్నారు. ఔరంగజేబు సమాధికి అసదుద్దీన్ నివాళి అర్పించడం చూసి మీరు సిగ్గుతో తలదించుకోవాలని అధికార పార్టీ శివసేనపై మండిపడ్డారు.
కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కలయికలో ఉన్న మహా వికాస్ అగాడి ప్రభుత్వం బాబ్రీ మసీదు వంటిదని, దాన్ని కూల్చే వరకు తాను విశ్రమించనని ఫడ్నవీస్ అన్నారు. కేవలం హనుమాన్ చాలీసాను పఠించిన తమ పార్టీ ఎంపీ నవనీత్ రాణా దంపతులను అరెస్ట్ చేసిందని మండిపడ్డారు. తన కొడుకు ఉద్ధవ్ థాక్రే హయాంలో హనుమాన్ చాలీసా చదవడం ద్రోహమని, ఔరంగజేబు సమాధిని సందర్శించడం రాష్ట్ర మర్యాద అని బాలా సాహెబ్ థాక్రే ఊహించి ఉండరని అన్నారు.