ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాతబస్తీ యువకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెట్రోవిట్ పదార్ధాలు వాడి మత్తుకు బానిసై హత్యలు, నేరాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. హద్దూపద్దూ లేకుండా మత్తు పదార్ధాలు అమ్ముతున్న మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువకుల పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పాతబస్తీలో ఓ నేరస్థుడితో పోలీసులు కుమ్మక్కయ్యారని, మాదక ద్రవ్యాలను కట్టడి చేయకపోతే చీకటి ఒప్పందాలను బయటపెడతానని వార్నింగ్ ఇచ్చారు. తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. రాత్రిపూట ప్రజలు సమస్యలతో వస్తే స్పందించడం లేదని, ఉదయం 11 గంటల వరకు ప్రజాప్రతినిధుల ఫోన్లు పని చేయడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. తీరు మార్చుకోకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడడని స్పష్టం చేశారు. అటు బీజేపీని టార్గెట్ చేస్తూ యాదాద్రి నిర్మాణంలో ముస్లిం వ్యక్తి కూడా పాల్గొన్నారని వెల్లడించారు. తెలంగాణలో అన్ని వర్గాలు కలిసిమెలిసి ఉండడం బీజేపీకి నచ్చడం లేదని అందుకే విద్వేషాలు రెచ్చగొడుతుందని ఆరోపించారు.