చనిపోతుందని ముందే ఇల్లు ఖాళీ చేయించాడు..
రానురాను మానవత్వం మంటగలుస్తోంది. మనుషులు సాటి మనిషి పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. తన ఇంట్లో అద్దెకున్న కుటుంబంలోని వృద్ధురాలు చనిపోతుందని భావించిన ఇంటి యజమాని.. ఆ కుటుంబాన్ని ఇల్లు ఖాళీ చేయించాడు. దీంతో దిక్కులేని ఆ కుటుంబం స్మశానానికి వెళ్లి తల దాచుకుంటోంది. ఈ దారుణం జగిత్యాలలో చోటు చేసుకుంది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. 95 ఏళ్ల వృద్ధురాలు నర్సమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. రేపోమాపో చనిపోతుందని యజమాని భావించాడు. ఒకవేళ ఆమె తన ఇంట్లో చనిపోతే ఇల్లంతా మైల పడుతుదని, మళ్లీ రంగులు వేయించాలంటే ఖర్చు అవుతుందని భావించాడు. అద్దెకుంటున్నవాళ్లను ఉన్నపళంగా ఇల్లు ఖాళీ చేయించాడు. విధిలేని పరిస్థితుల్లో నర్సమ్మ కుటుంబం శ్మశానాన్నే నివాసంగా మార్చుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించారు. అక్కడినుంచి నర్సమ్మ కుటుంబాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంటి యజమాని వైఖరి పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.