సాధారణంగా మేక ధర ఎంత ఉంటుంది? పది వేలో, మహా అయితే 20 వేలు ఉంటుంది. కానీ, చత్తీస్‌ఘడ్‌లో మాత్రం ఓ మేకను దాని యజమాని రూ. 70 లక్షలు నిర్ణయించాడు. బక్రీద్ సందర్భంగా రాయ్‌పూర్‌లోని బైజనాథ్ పరా మార్కెటుకు ఈ మేకను దాని యజమాని మధ్యప్రదేశ్ అనుప్పూరుకు చెందిన వాహిద్ హుస్సేన్ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా దాని ప్రత్యేకతలు వివరించాడు. ‘ఈ మేక మేలుజాతికి చెందినది. అంతేకాక, ప్రకృతి ప్రసాదం. దీని శరీరంపై ఉర్దూలో అల్లా, మహమ్మద్ అని రాసి ఉంది. అందేకే ఇంత రేటు నిర్ణయించా. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా పెట్టాను. దీన్ని చూసిన నాగపూరుకు చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేసి రూ. 22 లక్షలకు కొనుగోలు చేస్తానని చెప్పాడు. కానీ, ఆ ధరకు నేను అమ్మదలుచుకోలేదు. ఇంకా ఎక్కువ ధర వస్తుందని ఆశిస్తున్నా’నని తెలిపాడు. కాగా, బక్రీదును ముస్లింలు భక్తిశ్రద్దలతో జరుపుకున్న విషయం తెలిసిందే. మరి ఈ ప్రత్యేక మేక అమ్ముడుపోయిందో లేదో ఇంకా తెలియరాలేదు.