దోపిడీ రోగం.. ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ రూ. లక్ష - MicTv.in - Telugu News
mictv telugu

దోపిడీ రోగం.. ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ రూ. లక్ష

July 11, 2020

Oxygen Cylinder

ఏది హాట్ టాపిక్‌గా ఉంటే దానిని క్యాష్ చేసుకోవడం దళారులకు వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం హైదరాబాద్, నిజామాబాద్ వంటి కొన్ని చోట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. దీనిని ఇప్పుడు దళారులు అదునుగా భావించి ఆక్సిజన్ సిలిండర్ల దందాకు పాల్పడుతున్నారు. కరోనా రోగానికి సమంగా ఈ దోపిడీ రోగం ఇప్పుడు మరింత ఆందోళనకు గురిచేస్తోంది.  అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముతూ రెండు ముఠాలు లక్షల రూపాయలు దండుకుంటున్నాయి.  వీరి దందా గురించి పక్కా సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్‌ టాస్క్‌‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేసి ఆ ముఠాలను పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. 

ఎలాంటి అనుమతులు లేకుండా హైదరాబాద్‌లో ఆక్సిజన్‌ సిలిండర్లు అమ్ముతున్న రెండు ముఠాలపై దాడి చేసిన పోలీసులు  34 ఆక్సిజన్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ సిలిండర్ల దందా వెనకాల పలు క్లినిక్‌లు, ఆసుపత్రులు, వ్యక్తిగతంగా కొందరి హస్తం ఉందని పోలీసులు తేల్చారు. వారికి ఈ ముఠాలు ఆక్సిజన్‌ సిలిండర్లు అమ్ముతున్నారని పోలీసులు గుర్తించారు. ఒక్కొక్క సిలిండర్‌కు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సిలిండర్లను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు అప్పగించామని అన్నారు. కాగా, నగరంలో సిలిండర్ల అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేశారు.