దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య రాజధానిగా మారిపోతోంది. వాయు కాలుష్యంతోపాటు పొరుగు రాష్ట్రాల రైతులు పంటవ్యర్థాలను కాల్చుతుండడంతో ఆ పొగకు నగరం ఉక్కిరి బిక్కిరవుతోంది. దీంతో కాసింత స్వచ్ఛమైన గాలి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితిని వ్యాపారానికి అనుకూలంగా మార్చుకున్నారు కొందరు. స్వచ్ఛమైన, పరిమళభరితమైన గాలిని 15 నిమిషాలకు రూ. 299 చొప్పున అమ్మేస్తున్నారు!
దీని కోసం సాకేత్ ప్రాంతంలో ఆక్సిప్యూర్ పేరుతో దుకాణం తెరిచారు. గాలిలోనూ రకరకాల గాలులు అందుబాటులో ఉన్నాయి. నిమ్మగడ్డి, దాల్చిన చెక్క, పుదీనా, ఆరెంజ్, నీలగిరి, లావెండర్, వెనీలా, చెర్రీ, బాదం, పెప్పరమెంట్ తదితర సువాసనలతో గాలిని ఊపిరితిత్తుల్లో నింపుకోవచ్చు. పీడనాన్ని అదుపు చేస్తూ గాలిని అందిస్తామని, ఒకసారి పీల్చుకుంటే శరీరంలో ఉత్తేజం కలుగుతుందని షాపు నిర్వాహకులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యకరమైన గాలి కావడంతో చక్కగా నిద్ర పడుతుందని, జీర్ణశక్తి కూడా బాగుంటుందని అంటున్నారు!