ప్రేమికుల రోజు సందర్భంగా హోటల్ రూమ్ బుకింగ్స్ సేవలు అందించే ఓయోకి మంచి బిజినెస్ జరిగింది. ప్రేమను చూపించుకోవాలని భావించిన ప్రజలతో యాప్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గతంతో పోలిస్తే ఈ సారి ఏకంగా 35 శాతం పెరుగుదల కనిపించింది. వీక్ డే అయినప్పటికీ ఈ స్థాయిలో బుకింగ్స్ రావడం పట్ల ఓయో ప్రతినిధులే ఆశ్చర్యపోతున్నారు. కంపెనీ డేటా ప్రకారం ఏ నగరంలో ఎక్కువ బుకింగ్స్ జరిగాయో వివరాలు వెల్లడయ్యాయి. ఏ గోవానో లేదా ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ అయిన మనాలీ కాకుండా యూపీలోని బృందావనంలో అత్యధిక రూమ్స్ బుక్కయ్యాయంట.
గతేడాదితో పోలిస్తే అక్కడ ఏకంగా 231 శాతం పెరగడం మారిన యువత ఆలోచనకు నిదర్శనమని భావిస్తున్నారు. బెంగళూరు 51 శాతంతో రెండో స్థానంలో, హైదరాబాద్ 47 శాతంతో మూడో స్థానంలో, 38 శాతంతో కోల్‌కతా ఉన్నాయి. తర్వాత ముంబై, చెన్నై వంటి నగరాలున్నాయి. మరో విశేషమేంటంటే 2022లో రూం బుక్ చేసుకున్న వారు సగటున రెండు రోజులు ఉంటే అది ఈ సారి రెట్టింపై నాలుగు రోజులకు పెరగడం. ఈ స్థాయిలో పెరుగుదల నమోదు కావడానికి ఖర్చుకు వెనకాడని మధ్యతరగతి జనం కూడా కారణమని భావిస్తున్నట్టు ఓయో అభిప్రాయపడింది.