గ్లోబల్ వార్మింగ్ తో సతమతమయిపోతున్న ప్రపంచానికి ఓ మంచి న్యూస్. చిల్లులు పడ్డ మన ఓజోన్ పొర పూడుకుంటోంది. భూమి మీద ఉండే ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో కీలకపాత్ర పోషించే ఓజోన్ పొర సొంత చికిత్స చేసుకుంటోంది. ఎప్పుడో పడ్డ రంధ్రం ఇప్పుడు నెమ్మదిగా పూడుకుంటోంది. 2022 నుంచి ఇది మొదలైందని ఐక్యరాజ్యసమితికి చెందిన సైంటిఫిక్ అసెస్ మెంట్ ప్యానెల్ ఈ విషయాన్ని ఓ నివేదికలో వెల్లడించింది. క్లోరో ఫ్లోరో కార్బన్ల ఉద్గారాలు క్రమంగా తగ్గడమే దీనికి కారణం అని తెలిపింది. ప్రతీ నాలుగేళ్ళకు ఒకసారి ఓజోన్ పోర మీద ఐక్యరాజ్యసమితి నివేదిక విడుదల చేస్తుంది.
ఓజోన్ రంధ్రం 2022 సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 13 మధ్య సగటున 23.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి కుంచించుకుపోయింది. క్లోరో ఫ్లోరో కార్బన్ల ఉద్గారాలు ఇలాగే తగ్గుతూ పోతే 2066 నాటికి ఓజోన్ పొరలో ఉన్న కన్నం పూర్తిగా పూడుకుపోతుందని చెబుతున్నారు. మాంట్రియల్ ప్రోటో కాల్ మంచి ఫలితాలు ఇస్తున్నట్లు భావిస్తున్నామని తెలిపారు.
ఓజోన్ పొరకు రంధ్రం పడినట్లు మొదటిసారిగా 1980లో గుర్తించామని ఐక్యరాజ్యసమితి చెప్పింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో నలభై ఏళ్ళల్లో ఓజోన్ పొర 1980ల స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఉష్ణోగ్రత 2100 నాటికి 0.3 నుంచి 0.5 డిగ్రీల సెల్సియస్ తగ్గేలా హైడ్రో ఫ్లోర్ కార్బన్ల ఉత్పత్తి, వినియోగాన్ని తగ్గించడమే మాంట్రికల్ ఫ్రోటోకాల్ ఉద్దేశమని తెలిపింది.