త్వరలో కనుమరుగు కానున్న ఓ దేశం ముందుజాగ్రత్తగా డిజిటల్ దేశంగా మారుంతోంది. తన ఉనికిని, విశిష్టతలను భావితరాలకు గుర్తుచేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో ఒకటైన తువాలు తన భౌగోళిక, సాంస్కృతిక స్వరూపాన్ని డిజిటల్ రూపంలో భద్రపరుచుకుంటోంది. భూతాపోన్నతి వల్ల తువాలు భూభాగం క్రమంగా సముద్రంలో కలసిపోతోంది. మరో పదేళ్లలో కీలక భూభాగం కనుమరుగు కానుండంతో వర్చువల్, డిజిటల్ కంట్రీ ఆలోచన తలపెట్టింది. ఆస్ట్రేలియా, హవాయిల మధ్య ఉన్న తువాలు ఐలాండ్‌లో తొమ్మిది దీవులు ఉన్నాయి.
విస్తీర్ణం 26 చదరపు కిలోమీటర్లు, జనాభా 12 వేలు. వాతావరణ మార్పుల కారణంగా రాజధాని ఫునాఫుటి ఇప్పటికే 40 శాతం కడలిపాలైంది. 20130 నాటికి తువాలు మొత్తం సముద్రంలో కలసిపోతుందని శాస్త్రవేత్తల అంచనా. ఈ నేపథ్యంలో తమ దేశాన్ని డిజిటల్ రూపంలో భద్రపరుస్తున్నామని విదేశాంగ మంత్రి సైమన్ కోఫీ చెప్పారు. తువాలు లేకపోయినా ఐలాండ్ కనుమరుగైనా మెటావర్స్(వర్చువల్ స్పేస్)లో దేశ నైసర్గిక స్వరూపం, ప్రజల సంస్కృతి సంప్రదాయాలు, జీవిన విధానాన్ని వీక్షకులు చూసే వీలు ఉంటుంది. ఇందులో తువాలు చరిత్ర, చారిత్రక పత్రాలతో త్రీడీ చిత్రాలు ఉంటాయి. ఒక దేశాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలిగేలా డిజిటల్ కంట్రీని తీర్చిదిద్దుతారు.