ప్యాడ్ మ్యాన్ అరుణాచలంగా అక్షయ్ కుమార్ ! - MicTv.in - Telugu News
mictv telugu

ప్యాడ్ మ్యాన్ అరుణాచలంగా అక్షయ్ కుమార్ !

August 14, 2017

అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా సినిమా ‘ ప్యాడ్ మ్యాన్ ’. ఆర్. బాల్కీ దర్వకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా చాలా అంచనాలను పెంచింది. అక్షయ్ కుమార్ భార్యామణి ట్వింకిల్ ఖన్నా, ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా దర్శకురాలు గౌరీషిండే నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఆర్. బాల్కీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్నాడు ఈ ప్రాజెక్టును. సోనమ్ కపూర్, రాధికా ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమితా బచ్చన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అమితా బచ్చన్ ఈ సినిమాలో నటించడం వల్ల మరింత క్రేజ్ పెరిగింది ఈ సినిమాపై. అయితే బాలీవుడ్ లో ఇప్పుడు చాలా వరకు సినిమాలు బయోపిక్ లే వస్తున్నాయి. ఆ కోవలోనే ప్యాడ్ మ్యాన్ కూడా ఎవరి బయోపిక్ మీద వస్తోంది ? అనే ఆసక్తి అయితే నెలకొని వుంది. ఇంతకూ ఈ ప్యాడ్ మ్యాన్ సినిమాకు మూలం ఎక్కడ పడింది ? ఎవరి బయోపిక్ ఇది ? అనే ప్రశ్నకు సమాధానంగా తమిళనాడు కోయంబత్తూరుకు వెళ్ళాలి. అక్కడ తనకంటూ ఒక చరిత్రను క్రియేట్ చేస్కున్న అరుణాచలం మురుగనాథం బయోపిక్ ను గమనించాల్సిందే.

ఎవరీ అరుణాచలం మురగనాథమ్ ?

అరుణా చలం మురగనాథమ్ అనేవాడు ఒక సామాజిక వ్యవస్థాపకుడిగా మనకు దర్శనమిస్తాడు. ఈయనకు ప్యాడ్ మ్యాన్ అనే పేరెలా వచ్చింది ? దీని వెనకాల ఆయన చేసిన కృషి ఎలాంటిది ? అతను ఒక సమస్యకు చాలా సులభతరమైన మార్గాన్ని అన్వేషించాడు. అందుకే చరిత్రకెక్కాడు. సమాజం కోసం పోరాడేవాళ్ళు ఆదర్శప్రాయులే. కొందరు సమాజంలో వున్న ఒక సమస్యను భూతద్దంలోంచి చూపించి క్యాష్ చేస్కుందామని చూస్తుంటారు. కానీ అరుణాచలం వంటివారు మాత్రం సమాజానికి తాము ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి వారి వంతుగా సమాజానికి ఏదైనా చెయ్యాలని తపిస్తుంటారు. అలాంటి కోవలోకే వస్తారు అరుణాచలం మురుగనాథం.

అతను పుట్టింది 1962 లో అప్పటి మద్రాసు రాష్ట్రంలోని కోయంబత్తూరులో. స్త్రీలకు ప్రధానంగా వుండే రుతుక్రమం అనే సమస్యకు ఒక చిన్న తాత్కాలిక ఉపశమనమిచ్చే దిశలో ఏదైనా చెయ్యాలనుకున్నాడు. అప్పటి వరకు స్త్రీలు రుతుక్రమం అయితే కాటన్ బట్టలు, పేపర్లు వంటివి వాడేవారు. అలాంటి టైంలో ప్యాడ్స్ వచ్చాయి కానీ అవి చాలా కాస్ట్ రేట్లకి లభించేవి. అప్పుడు సాధారణ మహిళలకు రుతుక్రమం ఒక సమస్యగా వుండేది. అలాంటి మహిళలకు తక్కువ ధరకు ప్యాడ్స్ అందించలేమా ? అని ఆలోచించాడు అరుణాచలం మురుగనాథమ్. అలా సానిటరీ ప్యాడ్స్ మేకింగ్ మిషన్ను కనుగొన్నాడు. ఈ మిషన్ వల్ల ప్యాడ్స్ మానుఫ్యాక్చరింగ్ చాలా తక్కువ పెట్టుబడితో జరుగుతుంది.

తద్వార మార్కెట్లో ఇవి చాలా మంది మధ్య తరగతి ఆడవాళ్ళకు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ మహిళలకు సాధారణ రేట్లకు సానిటరీ ప్యాడ్స్ ను తీస్కొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఈ మిషన్ ను 23 నుండి 29 రాష్ట్రల్లో వాడకంలోకి తేవాలని, 106 దేశాలకు వ్యాప్తి చెయ్యాలనేది అతని సంకల్పం. అయితే ఇక్కడ ఏ ప్రయత్నమైనా స్టార్టింగ్ లో బెడిసి కొడుతుంది. అలాగే అరుణాచలం ప్రయత్నం కూడా తారుమారైంది ? ప్రారంభంలో కాటన్ లేకుండా తయారు చేసాడు. కానీ అవి ఫెయిలయ్యాయి. తన భార్య, సోదరీమణుల నుండి విమర్శలు ఎదుర్కున్నాడు. ఇదొక వృధా ప్రయత్నం అని చాలా మంది అతణ్ని విమర్శించారు. కానీ అరుణా చలం ఎవ్వరి మాటలు పట్టించుకోలేదు.

తను నమ్మిన సిద్ధాంతం ఇవాళ్ళ విమర్శలు ఎదుర్కున్నా రేపు తప్పకుండా గొప్ప సక్సెస్ అవుతందని నమ్మాడు. ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేసాడు. కొన్ని వ్యాపార పరిశ్రమలు అతని ప్రయత్నాన్ని నీరుగార్చాలని చూసాయి. కానీ అతను ఎక్కడా వెనకడుగు వెయ్యలేదు. ముందుకెళ్ళాడు. బెటర్ మెంట్ కోసం ఇంకా ఏం చెయ్యాలని అన్వేషణ ప్రారంభించాడు. తర్వాత సక్సెస్ అయ్యాడు. కాదన్న వారి మెప్పును పొందాడు. that is the spirit అంటే. మార్కెట్లో 10 పైసలుకు దొరికే ముడి సరుకును తీస్కొచ్చి కొన్ని కంపెనీలు దాని మీద 40 రెట్లు మునాఫా తీస్కుంటున్న దోపిడీని గమనించాడు. ఆ దోపిడీకి ప్రజలను బానిసలను చెయ్యొద్దనుకున్నాడు. మహిళల సమస్యను మార్కెట్ చేస్కుంటున్న వివిధ కంపెనీలకు ధీటుగా తను ఏదైనా ప్రత్యన్మాయ మార్గాన్ని వెతకాలనుకున్నాడు.

ఈ క్రమంలో అతనికి రీసెర్చ్ థీమ్ కోసం మహిళలలను కలిసాడు. కానీ వారు తమ రుతుక్రమ సమస్యలు ఇతని ముందు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డారు. అప్పుడతను కుక్క బ్లడ్ తో తన ప్రయోగం స్టార్ట్ చేసాడు. ఈసారి ప్యాడ్ తయారీలో సెల్యూలైజ్, అరటి గుజ్జు నుండి లభించే ఫైబర్, వెదురును వాడి ప్యాడ్స్ ను రూపొందించాడు. తన దగ్గరున్న 35 లక్షల రూపాయలు పెట్టుకొని ముంబయి నుండి దానికి కావాల్సిన సామాన్లు తెచ్చాడు. తన ఐడియాను మరింత విస్తృతం చేస్కోవడానికి 2006 లో మద్రాస్ ఐఐటికి వెళ్ళి షేర్ చేస్కున్నడు. చాలా మంది చాలా రకాల స్పందనలు చేసారు. వాటిల్లోంచి ఇంకాస్త బెటర్ మెంటును డెవ్ లప్ చేస్కున్నాడు. తర్వాత తన పని ప్రారంభించాడు. ఈ ప్రాసెస్ లో సక్సెస్ అవడానికి అతనికి రెండేళ్లు పట్టింది.

తయారు చేసిన ప్యాడ్స్ ని తొలుత మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కు ఫ్రీగా పంచి పెట్టాడు. వాడిన తర్వాత వారి అభిప్రాయాలు తెలుసుకున్నాడు. అలా నెమ్మదిగా సానిటరీ ప్యాడ్స్ ని సంపూర్ణంగా తయారు చేయడంలో 100 పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. ఈయన తయారీ విధానాన్ని వేరే కంపెనీలు కూడా ఫాలో అవడం విశేషం. ఇప్పుడు రకరకాల ప్యాడ్స్ మార్కెట్లో తక్కువ ప్రైస్ కు దొరుకుతున్నాయి. దానికి బీజం పోసింది మాత్రం అరుణాచలమే. వ్యాపారంలో హ్యూమన్ బీఇంగ్ వుండాలనే సిద్ధాంతాన్ని మార్గనిర్దేశం చేసిన అతను నిజంగా చాలా గొప్ప వ్యక్తి. అందుకే భారత ప్రభుత్వం అతణ్ని ‘ పద్మశ్రీ ’ అవార్డుతో సత్కరించుకుంది.

ఆ తర్వాత ఆయన ప్రతిభకు మెచ్చి చాలా స్వచ్ఛంద సంస్థలు అవార్డులు ఇచ్చి సత్కరించారు. ‘ గ్రాస్ రూట్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ’ అవార్డుల వంటివి లెక్కలేనన్నివి తన ఖాతాలో వున్నవి. 2006 లో టైమ్స్ మ్యాగజైన్ 100 మంది అత్యంత ప్రభావంతుల వ్యక్తుల జాబితాలో అరుణాచలం మురుగనాథమ్ ఫోటో ప్రచురించింది. హార్వర్డ్ యూనివర్సిటీలో, బెంగుళూరు, కలకత్తా వంటి చాలా నగరాల్లో ఆయన ప్రసంగాలు చేసారు.

మెన్స్ స్ట్రువల్ మ్యాన్ ( డాక్యుమెంటరీ ఫిల్మ్ )

ప్రపంచం యావత్తు మహిళా సమస్యకు తన వంతుగా ఒక మార్గాన్ని నిర్దేశించిన అరుణాచలం మురుగదాస్ జీవిత చరిత్ర పైన ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా వచ్చింది. ఏప్రిల్ 2013 లో అమిత్ విర్మాని దర్శకత్వంలో ఈ
‘ మెన్స్ స్ట్రువల్ మ్యాన్ ’ డాక్యుమెంటరీ ఫిల్మ్ వచ్చింది. 63 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీ చాలా అవార్డులు గెలుచుకుంది.

ప్యాడ్ మ్యాన్ గా

ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో ఈ ప్రభావవంతుడు, ప్రతిభావంతుడైన అరుణాచలం మురుగనాథమ్ జీవిత చరిత్రపై సినిమానే వస్తోంది. ఇదెంతో హర్షించదగ్గ విషయం. ‘ ప్యాడ్ మ్యాన్ ’ పేరుతో ఆర్. బాల్కీ దర్శకత్వంలో 13 ఏప్రిల్ 2018 కి వస్తోంది. చూడాలి ఒక పనిమంతుడి చరిత్ర సినిమాగా. తెలియని వారికి అతని గురించి తెలియాల్సిన అవసరం చాలా వుంది.

– సంఘీర్