కోటి రూపాయలు ఇంకా ఇవ్వలేదు.. మొగులయ్య వీడియోలు వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

కోటి రూపాయలు ఇంకా ఇవ్వలేదు.. మొగులయ్య వీడియోలు వైరల్

May 18, 2022

ప్రఖ్యాత జానపద గాయకుడు, కిన్నెర వాద్యకారుడు పద్మశ్రీ మొగులయ్య(Kinnera Mogulaiah) మళ్లీ వార్తల్లో నిలిచారు. సీఎం కేసీఆర్ తనకు ప్రకటించిన కోటి రూపాయల బహుమానం తనకింకా అందలేదని ఆయన చెబుతున్న వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. బీజేపీ నేతగా భావిస్తున్న ఓ వ్యక్తి కారులో కూర్చుని ఉండగా మొగులయ్య విండో పక్క నుంచి మాట్లాడుతూ కనిపించారు. కోటి రూపాయలింకా రాలేదని విసుక్కుంటూ, స్థానిక ఎమ్మెల్యే ఆ డబ్బులు ఇప్పిస్తానని చెప్పారని ఆయన అన్నారు. అంతేకాకుండా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గుణం గల వ్యక్తి అని పొగిడారు.

ఈ వీడియో బయటికి రావడంతో మొగులయ్య చాలా ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్ నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయంటూ తనతో మాట్లాడిన వ్యక్తికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా వీడియో తీసి మీడియాలో పెట్టినందుకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, అక్కడికి రావాలని డిమాండ్ చేశారు. తను ఫోన్ చేస్తున్న వీడియోను కూడా ఆయన చిత్రీకరింపజేసుకుని బయటికి వదిలారు. మొగులయ్య కూతురు ఇటీవలే ప్రమాదవశాత్తూ చనిపోవడం తెలిసిందే. మొగులయ్యకు కోటి రూపాయలతోపాటు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోడానికి స్థలం ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించడం తెలిసిందే.