పద్మావతికి బీజేపీ దెబ్బ! - MicTv.in - Telugu News
mictv telugu

పద్మావతికి బీజేపీ దెబ్బ!

November 2, 2017

సంజయ్‌లీలా భన్సారీ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ‘పద్మావతి’ మూవీ విడుదలకు మరో పెద్ద ఆటంకం ఎదురైంది. ఈసారి అధికారంలో ఉన్న బీజేపీనే అడ్డుపడింది.  వివాదాస్పదంగా మారిన ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు  కేంద్ర సెన్సార్‌ బోర్డు (సీబీఎఫ్‌సీ)కు లేఖ రాయాలని కాషాయదళం నిర్ణయించింది. ఈ చిత్రం రాజపుత్రుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో వాయిదా వేయాలని కోరతామని పార్టీ  అధికారి ప్రతినిధి ఐకే జడేజా తెలిపారు.  చిత్తోఢ్‌గఢ్ రాణి  పద్మావతికి, ఢిల్లీ సుల్తాన్  అల్లావుద్దీన్‌ ఖిల్జీకి మధ్య ప్రేమవ్యవహారం నడిచినట్లు ‘పద్మావతి’లో చూపినట్లు తమకు తెలుస్తోందని, ఈ గొడవకు పరిష్కారం లభించేంతవరకు మూవీ బయటికి రాకపోవడమే మంచిదని ఆయన అన్నారు. దీపికా పడుకుణే  ప్రధాన పాత్రలో, షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలవాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి రాజపుత్ లు ఆగ్రహంతో ఉన్నారు. షూటింగ్ సెట్లను ధ్వంసం చేసి, యూనిట్ సిబ్బందిపై  దాడికి కూడా పాల్పడ్డారు.