‘పద్మావతి’ కోట.. ఆత్మహత్య కాదు.. మతహత్య! - MicTv.in - Telugu News
mictv telugu

‘పద్మావతి’ కోట.. ఆత్మహత్య కాదు.. మతహత్య!

November 25, 2017

బాలీవుడ్ వివాదాస్పద చిత్రం ‘పద్మావతి’పై నిరసన నేపథ్యంలో రాజస్తాన్‌లోని నహర్‌గఢ్ కోటలో ఒక వ్యక్తి చనిపోయిన ఘటనపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అతడు ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరైనా చంపేసి ఉంటారని భావిస్తున్నారు. మృతుణ్ని చేతన్ కుమార్ సైనీ అనే 40 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. ఘటనా స్థలిలో రాళ్లపై కొన్ని మతపరమైన రాతలు కూడా కనిపించాయి. వాటిని బట్టి ఇది మతహత్య కావొచ్చని అనుమానిస్తున్నాయి. అయితే మిస్టరీ ఛేదించాకే అసలు విషయం తెలుస్తుందంటున్నారు.శవం పక్కన.. ‘చేతన్‌ చచ్చిపోయాడు..మేం అల్లా మనుషులం.. నిరసనలు చేసే వారి దిష్టిబొమ్మలను కాదు.. వారినే వేలాడదీస్తాం.. కాఫిర్.. అల్లా.. పద్మావతి వ్యతిరేకుల దిష్టిబొమ్మలను మాత్రమే ఉరితీయం.. ’ వంటి రాతలు ఉన్నాయి.. ’

ఎవరో చేతన్‌ను హత్య చేసి గందరగోళం సృష్టించడానికి ఇలాంటి కలగాపులగపు రాతలు రాసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చేతన్ హత్య వెనుక హిందూ అతివాద సంఘాలైనా ఉండొచ్చని, లేకపోతే ఇస్లామిక్ అతివాద సంఘాలైనా ఉండొచ్చని, కచ్చితంగా ఎవరనేది దర్యాప్తులో తేలుతుందని అన్నారు. పద్మావతి మూవీకి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నందున తమను బెదిరించడానికే హత్య చేసి, ఇలాంటి రాతలు రాశారని రాజ్ పుత్ కర్ణిసేన ఆరోపిస్తోంది.  కాగా, పద్మావతి సినిమాతో సైనీ మరణానికి ఎలాంటి సంబంధం లేదని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి మొబైల్ ఫోన్ దొరికిందని, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు సాగిస్తామని పోలీసులు చెప్పారు.