పాక్ మ్యూజియంలో అభినందన్ బొమ్మ..నెటిజన్లు ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ మ్యూజియంలో అభినందన్ బొమ్మ..నెటిజన్లు ఫైర్

November 10, 2019

ఎప్పుడూ ఇండియా సైన్యంపై దాడి, తప్పుడు ఆరోపణలు చేసే పాకిస్తాన్ ఈసారి మరోలా తన అక్కసును ప్రదర్శించింది. కరాచీలోని పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ వార్ మ్యూజియంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ నిలువెత్తు బొమ్మను ఏర్పాటు చేసింది. పాకిస్థాన్ జర్నలిస్ట్ అన్వర్ లోధీ, దీనికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. “మ్యూజియంలో పీఏఎఫ్ అభినందన్ బొమ్మను ఉంచింది. అతని చేతిలో ఓ టీకప్పును కూడా ఉంచితే మరింత బాగుండేది” అని లోధీ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 27న అభినందన్ పాకిస్తాన్ సైన్యానికి పట్టుబడిన విషయం తెలిసిందే. మిగ్-21 యుద్ధ విమానంతో పాకిస్తాన్ విమానాన్ని వెంబడిస్తూ పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించాడు. అది ప్రమాదవశాత్తు పాక్ భూభాగంలో కూలిపోయింది. దీంతో పాక్ దళాలు అభినందన్‌ను బంధీగా పట్టుకున్నాయి. ఆ వెంటనే అంతర్జాతీయ మీడియా నుంచి వచ్చిన ఒత్తిడితో, మార్చి 1న వాఘా బార్డర్ వద్ద అతన్ని విడిచిపెట్టారు. ఇది జరిగింది. అయితే పాక్ తాజాగా మ్యూజియంలో పెట్టిన అభినందన్ ఫోటోలో వెనక పాకిస్తాన్ సైనికుడు ఉన్నాడు. భారత కమాండర్ అభినందన్‌ను పట్టుకున్నాం అని సందర్శకులకు చూపడానికే ఈ పని చేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. ఇది తప్ప పాకిస్తాన్ సైన్యానికి చెప్పుకోవడానికి వేరే విజయాలు లేవని మరికొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.