వైకాపా ఎన్నికల ఖర్చు 85 కోట్లు.. అందులో పీకేకు 37 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

వైకాపా ఎన్నికల ఖర్చు 85 కోట్లు.. అందులో పీకేకు 37 కోట్లు

November 16, 2019

ఏ ఎన్నికలైనా, ఏ పార్టీకైనా చతురోపాయాలతో విజయాన్ని కట్టబెడతాడని పేరు సంపాయించుకున్న ప్రశాంత్ కిశోర్‌(పీకే)కు డబ్బులు బాగానే ముడుతున్నాయి. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలో జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీకే నుంచి అందుకున్న సేవలకు గాను ఏకంగా రూ. 37.57 కోట్లు చెల్లించింది. ఆ పార్టీ ఎన్నికల్లో మొత్తం రూ. 85 కోట్లు ఖర్చు చేయగా అందులో సింహభాగం పీకే టీం ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపాక్)కు వెళ్లింది. తర్వాత జగన్‌కే చెందిన సాక్షి మీడియాకు దక్కింది. ఈమేరకు పార్టీ స్వయంగా ఎన్నికల సంఘానికి నివేదిక అందజేసింది. 

YSR CONGRESS PARTY.

‘ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందు మా వద్ద రూ.74 లక్షలు ఉండేవి. ఎన్నికల తేదీలు వచ్చాక రూ.221 కోట్ల విరాళాలు వచ్చాయి. ఎన్నికల కోసం  రూ.85 కోట్లు ఖర్చు పెట్టాం. రూ. 9.7 కోట్లు పార్టీ ప్రధాన ప్రచార కార్యకర్తల కోసం, రూ. 36 కోట్లు పలు మీడియా ప్రచారం కోసం వెచ్చించాం. ఇందులో రూ.24 కోట్లు  జగతి మీడియా సంస్థకు చెల్లించాం. ఎన్నికలు ముగిశాక మా వద్ద రూ.138 కోట్లు మిగిలాయి..’ అని వివరించింది. 

టీడీపీ కూడా ఎన్నికల ఖర్చు లెక్కలు తెలిపింది. ‘ఎన్నికల తేదీలు వచ్చే నాటికి రూ.102 కోట్లు ఉన్నాయి. తర్వాత  రూ.131 కోట్ల విరాళాలు వచ్చాయి. మొత్తం 77 కోట్లు ఖర్చు పెట్టాం. మీడియాలో ప్రచారానికి రూ. 49 కోట్లు చెల్లించాం.  చంద్రబాబు నాయుడి ప్రచారం కోసం హెలికాప్టర్లకు రూ.9 కోట్లు ఖర్చు చేశాం’ అని తెలిపింది. తమకు రూ. 188 కోట్ల విరాళాలు రాగా, రూ.29 కోట్లు ఖర్చు చేశామన టీఆర్ఎస్ ప్రకటించింది.