‘తేడా’గా వున్న ‘పైసా వసూల్’! - MicTv.in - Telugu News
mictv telugu

‘తేడా’గా వున్న ‘పైసా వసూల్’!

September 1, 2017

చిత్రం :  పైసా వసూల్

నిడివి : 140 నిముషాలు

బేనర్ : భవ్య క్రియేషన్స్

పాటలు : డా. సి. నారాయణరెడ్డి, భాస్కరభట్ల, పులగం చిన్నారాయన, అనూప్ రూబెన్స్

సంగీతం : అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫి : ముఖేష్ జి

ఎడిటింగ్ : జునైద్ సిద్ధికి

నిర్మాత : వి. ఆనంద్ ప్రసాద్

కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం : పూరీ జగన్నాథ్

నటులు : నందమూరి బాలకృష్ణ, శ్రియా శరణ్, ముస్కాన్ సేథి, క్యార దత్, విక్రమ్ జీత్ విరక్, పృధ్వీ, ఆలి తదితరులు

మేరా నామ్ తేడా.. తేడా సింగ్.. దిమాక్ తోడా.. చాలాతేడా..’ ఈమాట పలికింది హీరో బాలకృష్ణే అయినా పలికించింది మాత్రం పూరీ జగన్నాథ్! ఈ తేడా యివాల్టిది కాదు, ‘నువ్వు నందా అయితే నేను బద్రీ.. బద్రీ నాథ్’ అని ‘బద్రి’లో పవన్ కళ్యాణ్ అన్నా- ‘నేను చంటి.. చంటిగాడు లోకల్.. యిక్కడే వుంటాడు’ అని ‘ఇడియట్’లో రవితేజా అన్నా- ‘ఎవడు కొడితే దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు’ అని ‘పోకిరి’లో మహేష్ బాబు అన్నా- తేడాగా వున్నా ఆతేడా పూరీనే! హీరోలను మూస నుంచి కొత్తదనంలోకి లాక్కొచ్చి ‘నేల టికెట్ గాడ్ని’ పట్టం కట్టింది తనే! పూరీ అన్ని సినిమాల్లో హీరోలు అందరూ వొక్కలాగే పోతపోసినట్టు అచ్చుగుద్దినట్టు వుంటారు! పూరీ కొత్తదనం అనుకున్నది పాతబడింది! పూరీయే తీసిందే తీసి తీసి అరగదీసేసాడు! మరి ‘పైసా వసూల్’లో యేమి యిరగదీసాడు?

‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో నూరు సినిమాలు పూర్తి చేసుకున్న హీరో బాలకృష్ణ నూట వొకటో సినిమాగా వచ్చింది ‘పైసా వసూల్’. ఇప్పటివరకూ బాలకృష్ణ అనేక పాత్రలు చేశాడు. అయితే బాలకృష్ణ పూరీల కాంబినేషన్ అంటేనే తేడా అనిపిస్తుంది! ఆ తేడా యేమిటంటే బాలకృష్ణ.. న్యూ జనరేషన్ హీరోలు మహేష్ బాబు, ప్రభాష్, జూ.ఎన్టీఆర్ లు చేసినలాంటి వొక క్యారక్టర్ని డిజైన్ చేశాడు పూరి! నిజానికి పూరీ సినిమాల్లో హీరో క్యారక్టరైజేషనే సినిమా! ఆ క్యారక్టరైజేషన్ తెలిసిందే! కాని బాలకృష్ణ చెయ్యడం కొత్తగా వుంది! అదే కొంతవరకూ ఎంటర్టైన్ చేసింది! కథగా చూసుకుంటే చాలా సార్లు చూసేసిన సినిమానే!

కథ కొస్తే- కనిపించినవారినల్లా కాల్చేయడం.. దొరికిన అమ్మాయిని దొరికినట్టు యెత్తుకు పోవడం.. విధ్వంసం సృష్టించడం.. యిలా అరాచకత్వం ప్రజ్వరిల్లుతుంటుంది. ఎప్పటిలాగే హీరో తేడాసింగ్ (బాలకృష్ణ) ఐటమ్(క్యార దత్)తో పాటేసుకొని గన్ లో బుల్లెట్స్ అవసరంగా లేకుండా కాల్చేసి తన వివరాల ఇంట్రడక్షన్ని వికీపీడియా సాక్షిగా చెప్తాడు. ఆపైన లాయర్ పృధ్వీని వెళ్ళగొట్టి ఆ యింట్లో చేరి, పై యింట్లో వున్న హారిక (ముస్కాన్ సేథి)ని యిష్టపడతాడు. వెంటపడతాడు. హారిక యేమో తన అక్క సారిక (శ్రియ) కోసం వెతుకుతూ వుంటుంది. పృధ్వీ కారణంగా అడ్డొచ్చిన గ్యాంగుని కొడతాడు తేడా. ఆడిపాడిన ఐటమ్ ఐటమ్ కాదు, కిరణ్మయి (క్యార దత్) తేడా సింగ్ కు గన్ గురిపెడుతుంది. క్లబ్బులో ఆడిన ఆమె అసిస్టెంటు కమీషనర్ ఆఫ్ పోలీస్. ఒకవేపు పోలీసు డిపార్టమెంట్  తమ వల్ల కాదని ముడుచుకున్న చేతులు ఎత్తేసి, దాన్ని ఆపగల గట్స్ వున్న వ్యక్తి కోసం సెర్చ్ చేస్తూ ‘తేడా’ అందుకు సమర్ధుడు అనుకుంటారు. బాబ్ మార్లీ గ్యాంగులో చేరమంటారు. చేరిన ‘తేడా’ వెనకటి ‘పండు’గాడి లాగే తన గట్స్ చూపిస్తాడు. ఆపైన ‘తేడా’ని దారికి తెచ్చుకోవడానికి గ్యాంగు హారికని యెత్తుకు పోతారు. ‘తేడా’ గ్యాంగుని చంపేసినా హారికయే ‘తేడా’ని కాల్చేస్తుంది. అసలు ‘తేడా’ యెవరు? సారికకు ‘తేడా’కు వున్నా సంబంధం యేమిటి అన్నదే మిగతా కథ!

గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో అల్లిన యీ కథలో ‘తేడా’ క్యారక్టర్ మాత్రమే గుర్తుంటుంది. మిగతా క్యారక్టర్లు చెప్పుకోనేవి కావు, గుర్తుండేవి కావు. సినిమా ఎమోషనల్ గా హుక్ చెయ్యదు. కాకపోతే ‘తేడా’ వల్ల కాస్త తెరిపిన పడతాం. పూరి తన చుట్టూ తాను తిరగకుండా వుంటే బాగుండేది. తగ్గ కథ వచ్చేది. క్యారక్టర్ పరంగా బాలకృష్ణ బాగానే ఆకట్టుకున్నారు. శ్రియ ఇంటర్వెల్ తరువాతనే కనిపిస్తుంది. చెప్పుకోవడానికి లేదు. క్యార దత్, ముస్కాన్ సేథిలను అస్సలు చెప్పుకోవడానికి లేదు. పృధ్వీకి కూడా చెప్పుకొనే కామిడీ లేదు. ఆలీ పాత్ర వుండి వుపయోగం లేదు.

సినమాలో మాటలు ‘తేడా’కు తగ్గట్టు వున్నాయి. ఆకట్టుకున్నాయి. పాటలు ఫరవాలేదు. బాలకృష్ణ ‘అరె మావా ఏక్ పెగ్ లా’ అని పాట కూడా పాడారు. తగ్గ స్టెప్స్ వేశారు. పాత పాట ‘కంటి నవ్వు చెపుతోంది.. మూగ మనసులో మాట వో పిల్లా’ పాత పాటకు కోరియోగ్రఫీ అద్భుతంగా చేశారు. చాలాబాగుంది. న్యూ లుక్ తో కెమెరా పనితనం బాగుంది. ఫైట్స్ లో ‘బ్లర్’ ఫైట్ నవ్వుకోనేలా వుంది.

అలాగే అవుట్ ఆఫ్ ది సినిమా పోయి ‘ఫాన్స్ .. ఫామిలీ’ అని హీరోయిజాన్ని- ‘జై బాలయ్య’అని కొత్తరకంగా కీర్తించడం.. చొక్కాలని చించుకోవడం లాంటివి.. సినిమా అయిపోయినా ఎండ్ స్క్రోల్స్ లో వెంటాడుతాయి!

మొత్తానికి సినిమా చూశాం అన్నట్టుగా వుంది. బాగుందా అని అడిగితే? లేదు అనలేం. ఉంది అనలేం. ‘ఒకే’ అనిమాత్రం అనగలం!

రేటింగ్ : 2. 75/5

-జాసి