బాలీవుడ్ నటుల ఇళ్లను కొనడానికి ముందుకొచ్చిన పాక్  - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్ నటుల ఇళ్లను కొనడానికి ముందుకొచ్చిన పాక్ 

September 28, 2020

బాలీవుడ్ నటుల ఇళ్లను కొనడానికి పాక్ ప్రభుత్వం ముందుకొచ్చింది. పాక్‌లోని పెషావర్‌ నగరం నడిబొడ్డున ఉన్న బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్, రాజ్ కపూర్ పూర్వీకుల ఇళ్లను కొనుగోలు చేసేందుకు పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇవి శిథిలావస్థ దశలో ఉన్నాయి. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ కట్టడాలను కూల్చివేయకుండా.. జాతీయ వారసత్వంగా గుర్తించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖైబర్‌ పఖ్తున్ఖ్వా పురావస్తు శాఖ ఈ రెండు భవనాలను కొనుగోలు చేసేందుకు తగిన నిధులు కేటాయించాలని నిర్ణయించింది. వీటి ధరను నిర్ణయించడానికి పెషావర్‌ డిప్యూటీ కమిషనర్‌కు ఒక లేఖ పంపారు. రాజ్ కపూర్ పూర్వీకుల నివాసాన్ని ‘కపూర్ హవేలీ’ అని పిలుస్తారు. ఇది కిస్సా ఖ్వానీ బజార్‌లో ఉండగా, దీనిని 1918-22 మధ్య కాలంలో నిర్మించారు. రాజ్ కపూర్ తాత దేవాన్ బాషేశ్వర్‌నాథ్ కపూర్ దీనిని నిర్మించారు. ఈ భవనంలోనే రాజ్ కపూర్, ఆయన మామ త్రిలోక్ కపూర్ జన్మించారు. దీనిని ప్రాంతీయ ప్రభుత్వం జాతీయ వారసత్వంగా ప్రకటించింది.

ఇక దిలీప్ కుమార్‌కు చెందిన పూర్వీకుల ఇల్లు కూడా అదే ప్రాంతంలో ఉంది. 100 సంవత్సరాల పురాతనమైన ఈ ఇల్లు కూడా శిథిలావస్థకు చేరుకుంది. 2014లో అప్పటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం దీనిని జాతీయ వారసత్వంగా ప్రకటించింది. రెండు భవనాల యజమానులు గతంలో వీటిని పడగొట్టి కమర్షియల్‌ ప్లాజాలను నిర్మించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని వాటిని సంరక్షించాలని పురావస్తు శాఖ భావించింది. దీంతో ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి. కపూర్ హవేలీ యజమాని అలీ ఖాదర్ మాట్లాడుతూ.. ‘ఈ భవనాన్ని కూల్చివేయడానికి నేను ఇష్టపడను. దేశ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఈ చారిత్రాత్మక నిర్మాణాన్ని పరిరక్షించాలని పురావస్తు శాఖ అధికారులతో అనేకసార్లు విన్నవించాను’ అని తెలిపారు. ఈ ఏడాది ముంబైలో మరణించిన రిషి కపూర్ చేసిన అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని కపూర్ హవేలీని మ్యూజియంగా మార్చాలని 2018లో పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. రెండు సంవత్సరాల కాలం గడిచినప్పటికీ ఈ ప్రకటన ఇంకా కార్యరూపం దాల్చలేదు. కాగా, దీనిని ప్రభుత్వానికి అమ్మేందుకు యజమాని ఖైబర్‌ పఖ్తున్ఖ్వా ప్రభుత్వం నుంచి రూ.200 కోట్లు  డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. పెషావర్‌లో ఇవేకాకుండా 300 సంవత్సరాల పూర్వం నాటి  సుమారు 1,800 చారిత్రాత్మక నిర్మాణాలు ఉన్నాయి.