ప్రధాని షాబాజ్ షరీఫ్ నేతృత్వంలో కొలువుదీరిన పాకిస్థాన్ కొత్త ప్రభుత్వంలో .. తీవ్ర విద్యుత్ కొరత నెలకొంది. కరెంటును ఆదా చేసేందుకు పాక్ సర్కార్ కొత్త కొత్త చర్యలు చేపట్టింది. వాటిల్లో భాగంగా రాత్రి పది గంటలు దాటిన తర్వాత వివాహ వేడుకలు నిర్వహించకూడదని తేల్చి చెప్పింది. దేశ వ్యాప్తంగా రాత్రి 8.30 గంటలకల్లా దుకాణాలు, మార్కెట్లను బంద్ చేయాలని వ్యాపారులను ఆదేశించింది. అంతేకాకుండా ప్రతి శనివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. దీని ద్వారా విద్యుత్, ఇంధనం పెద్ద ఎత్తున ఆదా అవుతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వాన జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇస్లామాబాద్‌లో బుధవారం నుంచే ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయని ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. వీటిని కఠినంగా అమలు చేసేందుకు పోలీసు, జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలు వచ్చాయని, ఆంక్షలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక అధికారులు హెచ్చరించారు.