Pak involved in Udaipur incident: Center orders probe
mictv telugu

ఉదయ్‌పూర్ హత్యలో పాక్ ప్రమేయం.. దర్యాప్తుకు కేంద్రం ఆదేశం

June 29, 2022

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పట్టపగలే జరిగిన దర్జీ కన్హయ్య హత్య కేసులో నిందితులిద్దరికీ పాక్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ.. లోతుగా దర్యాప్తు చేయవలసిందిగా జాతీయ దర్యాప్తు ‌బృందాన్ని ఆదేశించింది. కరాచీలో ఉన్న సున్నీ సంస్థ దావత్ ఇ ఇస్లామి అనే సంస్థకు వీరు స్లీపర్ సెల్స్‌గా పనిచేస్తున్నట్టు తెలిసొచ్చింది. అటు హత్యకు గురైన కన్హయ్య అటాప్సీ ప్రాథమిక నివేదిక వివరాలు వచ్చాయి. అందులో హతుడి ఒంటిపై 26 కత్తిపోట్లు ఉండడంతో పాటు అధిక రక్తస్రావంతో చనిపోయాడని ఉంది. మరోవైపు హత్యకు పాల్పడడంతో పాటు ప్రధాని మోదీని కూడా చంపేస్తామని నిందితులు వీడియో రిలీజ్ చేయడంతో రాజస్థాన్‌లో శాంతిభద్రతలు అదుపు తప్పే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రభుత్వం ఉదయ్‌పూర్‌లో 144 సెక్షన్ పెట్టి అదనపు బలగాలను తరలించింది. ఇదిలా ఉండగా, నిందితులను పోలీసులు పట్టుకొని తరలిస్తున్న వీడియోను స్థానిక కాంగ్రెస్ నేత ఒకరు సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో అది వైరల్‌గా మారింది. కాగా, హతుడు కన్హయ్య అంత్యక్రియలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.