Pak lost in the hands of Lanka.. It will be difficult in the final match tomorrow!
mictv telugu

లంక చేతిలో పాక్ చిత్తు..రేపటి ఫైనల్‌‌ మ్యాచ్‌లో కష్టమే!

September 10, 2022

ఆసియా కప్ సూపర్-4లో భాగంగా గతరాత్రి పాకిస్తాన్‌-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టును శ్రీలంక జట్టు చిత్తు చేసింది. ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో శ్రీలంక జట్టు ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో రేపు జరగనున్న ఆసియా కప్ ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో పాకిస్తాన్ గెలవటం కష్టమే అంటూ పాకిస్తాన్ క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో..తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. శ్రీలంక బౌలర్లు వేసిన బంతులకు వణికిపోయింది. వరుసగా వికెట్ల మీద వికెట్లను కోల్పోయింది. శ్రీలంక బౌలర్లు..వనిందు హసరంగ, ప్రమోద్ మధూసన్‌లు పాక్ బ్యాటర్ల భరతం పట్టారు. వీరి దెబ్బకు పాక్ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 121 పరుగులకు ఆలౌట్ అయింది. అందులో కెప్టెన్ బాబర్ ఆజం (30), నవాజ్ (26) పరుగులు చేశారు. మిగతా బ్యాట్‌మెన్స్ అంతగా ఆకట్టుకోలేకపోయారు. లంక బౌలర్లలో హసరంగ 3, మహీష్ తీక్షణ, ప్రమోద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం 122 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక..17 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. తొలి ఓవర్ రెండో బంతికి కుశాల్ మెండిస్ డకౌట్ కాగా, రెండో ఓవర్‌లో దనుష్క గుణతిలక డకౌట్ అయ్యాడు. ఐదో ఓవర్ చివరి బంతికి 29 పరుగుల వద్ద ధనంజయ డి సిల్వా (9) వెనుదిరిగాడు. దీంతో లంక పని అయిపోయినట్టేనని భావించారు. అయితే, ఓపెనర్ పాతుమ్ నిశ్శంక అజేయ అర్ధ సెంచరీ (55)తో ఆదుకుని జట్టును విజయ తీరాలకు చేర్చాడు. భానుక రాజపక్స (24), కెప్టెన్ దాసున్ షనక (21) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్ వనిందు హసరంగ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు’ సొంతం చేసుకున్నాడు.

మరోపక్క రేపు జరగనున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కోసం అటు శ్రీలంక అభిమానులు, ఇటు పాకిస్తాన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు గెలుస్తుందా? లేక శ్రీలంక జట్టు గెలుస్తుందా? అని ఉత్కంఠతో ఉన్నారు. గతరాత్రి జరిగిన మ్యాచ్ ప్రకారం చూస్తే, దాదాపుగా శ్రీలంక జట్టే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరి ఫైనల్‌లో ఏ జట్టు గెలుస్తుంది అనేది చూడాలంటే మరొక రోజు వేచి చూడాల్సిందే.